Telangana Assembly Election 2023 : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, రేవంత్ రెడ్డిలపై కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులు అందాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ముందుగా ఫిర్యాదు చసింది. బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో కవిత ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ భారాసకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇది ఎన్నికల ప్రచారం చేయడమేనని చఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ) వికాస్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం కవితపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.
మరో వైపు రేవంత్ రెడ్డిపైనా బీఆర్ఎస్ లీగల్ టీం ఈసీకి ఫిర్యాదు చేసింది. కొడంగల్ లో ఓటు వేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టేలా మట్లాడారన్నారు. ఈ అంశంపైనా డీఈవో రిపోర్టు కోసం చూస్తున్నామని .. రిపోర్టులను బట్టి ఎఫ్ఐఆర్‌ను నమోదు చేస్తామన్నారు.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కొడంగల్ నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ దొడ్డిదారిన గెలవాలని కేసీఆర్ చూస్తున్నాడని.. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. డిసెంబర్ 9వ ఎల్బీస్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి, అదే రోజు కేబినెట్ భేటీ అయ్యి, ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమి ఖరారు కావడంతో సెంటిమెంట్‌తో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సీఎం కేసీఆర్ కుట్రపూరితంగా నాగార్జున సాగర్ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. భారతంలో శకుని మాదిరిగా కేసీఆర్ కుట్రలు చేస్తూ ఆఖరి ప్రయత్నంగా దింపుడు కల్లం ఆశలకు తెరలేపారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ విషయంలో వ్యూహాత్మకంగానే వివాదం చేస్తున్నారని దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
కామారెడ్డిలో రేవంత్ సోదరుడికి వ్యతిరేకంగా ధర్నా
కామారెడ్డి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లోకి స్థానికేతరుడైన రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చొరబడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రం ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల నిబంధన ప్రకారం స్థానికేతర్లెవరు ఈనెల 28 నుంచి స్థానికంగా ఉండరాదనే నిబంధనలో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతూ పోలింగ్ బూత్‌లలోకి నేరుగా చొచ్చుకు వెళుతున్నాడని ఆరోపించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌తో పాటు బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ బూతులోకి వెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతనికి ఎన్నికల నిబంధనలు ఉండవా అని అన్నారు. వెంటనే కొండల్ రెడ్డిని అరెస్టు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత నిట్టు వేణుగోపాలరావు తో పాటు స్థానిక కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. నల్ల కార్ల కాన్వాయ్‌తో పోలింగ్ బూతుల్లో హల్‌చల్ చేస్తున్నా చోద్యం చూస్తున్న ఎలక్షన్ అధికారులు, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. దీంతో కొండలరెడ్డి పీఏ ను పోలీసులు అరెస్టు చేశారు.