Elections 2024 : మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం ఘటనపై ఈసీ సీరియస్ గా స్పందించింది. మొత్తం ఏడు ఈవీఎంలను ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ధ్వంసం చేశారని ఇప్పటికే కోర్టులో ఏ-1గా ఎమ్మెల్యే పిన్నెల్లిని పరిగణించాలని మెమో దాఖలు చేశామని సీఈవో ఎంకే మీనా మీడియాకు తెలిపారు. పిన్నెల్లి అంశంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దాదాపుగా పది సెక్షన్ల కింద కేసులు పెట్టామని నేరం రుజువు అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుందన్నారు. రెండు రోజులుగా పిన్నెల్లిని అరెస్టు చేయాడనికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని.. ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఎంకే మీనా స్పష్టం చేశారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో కేసులు పెట్టారు ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పిన్నెల్లిపై పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు కూడా నమోదు చేశారు. పిన్నెల్లిపై ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలను ద్వంసం చేస్తే అందులో ఏడు ఘటనలు మాచర్లలోనే జరిగాయి. ఏడింటిలోనూ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఫుటేజీలన్నిటినీ ప్రత్యేక దర్యాప్తు బృందాలకు పోలీసులు అందిచినట్లుగా తెలుస్తోంది.
ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలన్నింటినీ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించామని సీఈవో మీనా తెలిపారు. ఆయా చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసినా కొత్త వాటిని ఏర్పాటు చేిస పోలింగ్ కొనసాగించామని.. పాతవాటిలో డేటా భద్రంగా ఉందన్నారు. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌కు సంబంధింంచి పోలీసులు ఇరవయ్యో తేదీన కేసు నమోదు చేశారని తెలిపారు. ఇరవయ్యో తేదీన రెంట చింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని అందులో మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే చేర్చారన్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన వాహనాలను.. సంగారెడ్డి వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే పిన్నెల్లి మాత్రం ఫోన్ తో పాటు ఇతర సామాగ్రిని వదిలేసి పారిపోయారని అంటున్నారు. ఆయన విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంజటంతో పోలీసులు ముందస్తుగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో ఈసీ సాయంత్రం ఐదు గంటలకల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ సమయం కల్లా అరెస్టు చేయకపోతే ఈసీ ఆగ్రహిస్తుందన్న ఆందోళనలో అధికారులు ఉన్నారు. అయితే పిన్నెల్లి అరెస్టు కోసం వచ్చిన వారి వివరాలు.. ఆయనకు తెలుస్తున్నాయని అందుకే.. ఆయన దొరకకుండా తిరుగుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.