Praja Ashirvada Sabha at Gajwel: బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న దళితులు అందరికీ ఒకే విడతలో దళిత బంధు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దళితవాడల నుంచి దరిద్రాన్ని పీకి అవతల పారేద్దామని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి తనకు 70 ఏళ్ల వయసు వస్తుందని, ఈ వయసులో తనకు పదవులపై ఆశ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ తెచ్చిన కీర్తి ప్రతిష్ఠ తనకు అపారంగా ఉందని అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి రోజు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడారు. 


ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఆమె రాజ్యంలో అన్నీ ఆకలి చావులు, ఎమర్జెన్సీలు, ఎన్ కౌంటర్లే ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు, రైతు బంధు, 24 గంటల కరెంటుకు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. ‘‘ఫిబ్రవరి వస్తే నాకు 70 ఏళ్ల వయసు వస్తుంది. మీ ఆశీర్వాదంతో తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు ఆకాశమంత. ఇక్కడ పదవులు ముఖ్యం కాదు. ఇప్పటికే పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. తెలంగాణ భవిష్యత్తులో నిరక్షరాస్యత, పేదరికం లేని రాష్ట్రం అవ్వాలి. మంచి వైద్య సదుపాయాలు అందాలి’’ అని కేసీఆర్ అన్నారు.


తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు సిద్దిపేట గడ్డ తనకు బలాన్ని ఇచ్చిందని కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత సాధించిన తెలంగాణను తీర్చిదిద్దడం కోసం తనను ఎమ్మెల్యేను చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ ఈ గజ్వేల్‌ అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. గజ్వేల్‌ తన గౌరవాన్ని పెంచిందని, తనను ఈ స్థాయికి తెచ్చిందని చెప్పారు. 


గజ్వేల్‌కు రైలు వస్తుందని ఏనాడూ అనుకోలేదని.. కానీ రైలు కూడా వచ్చేసిందని అన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి గజ్వేల్‌ మోడల్‌ అభివృద్ధిని చూడటానికి ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారని అన్నారు. ఇక్కడి ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌.. అడవుల పునరుద్ధరణ, మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు అన్ని చూసేందుకు వస్తున్నారని అన్నారు. మిషన్‌ భగీరథ పథకాన్ని గురించి తెలుసుకోవడానికి కోమటిబండకు రాని రాష్ట్రమే లేదు భారత దేశంలో అని కొనియాడారు. అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం తాగుతున్నది, సాగుకు వినియోగిస్తున్నది మనందరం ఎంతో పవిత్రంగా భావించే గోదావరి జలాలు అని అన్నారు. ఇప్పటికే చాలా గొప్ప అయిందని, ఇకపై మనం సంతోషపడితే సరిపోదని, ఇంకా చాలా అభివృద్ధి కావాల్సి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. 


అంతకుముందు వరంగల్ లో..
అంతకుముందు కేసీఆర్ వరంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కూడా మాట్లాడారు. తెలంగాణ చరిత్ర వైభవానికి సాక్షీభూతంగా ఉన్న ఈ వరంగల్ వీరభూమికి తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక ఘట్టాలకు వరంగలే వేదికగా నిలిచిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఉద్యమంలో అతి భారీ బహిరంగ సభ ఈ వరంగల్‌ నగరంలోనే జరిగిందని అన్నారు. ప్రజలు వేసే ఓటు తెలంగాణతోపాటు వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. కాబట్టి అలాంటి ఓటును ఆషామాషీగా వేయవద్దని అన్నారు. మంచి అభ్యర్థికి ఓటు వేస్తే మంచి జరుగుతుందని అన్నారు. బాగా చర్చించుకొని, మంచి పార్టీ ఏదో, మంచి అభ్యర్థి ఎవరో తేల్చుకుని ఓటేయాలని కేసీఆర్ అని సూచించారు.