తెలంగాణలో సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగియనుంది. దీంతో విజయం కోసం అభ్యర్థులు చేయని ప్రయత్నం లేదు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని విధాలుగా ట్రై చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారు. చివరకు ఏమోషనల్ అవుతున్నారు.
హుజురాబాద్ నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి ఎమోషనల్ అయ్యాడు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఫ్యామిలీతో ప్రచారం చేసిన కౌశిక్ రెడ్డి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలిసారి టికెట్ దక్కించుకున్న కౌశిక్ రెడ్డి కచ్చితంగా విజయాన్ని ముద్దాడాలని ఊరూవాడా కాలికి చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు.
ఆయనతోపాటు భార్య, కుమార్తె కూడా ప్రచారంలో హుషాలుగా పాల్గొంటున్నారు. చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి తనను కచ్చితంగా గెలిపించాలని అభ్యర్థించారు. గెలవడమో తన కుటుంబం ఆత్మహత్య చేసుకోవడమో రెండే మార్గాలని అభిప్రాయపడ్డారు. ప్రచారం చేసిన ప్రాంతంలోనే తమ శవాలు కనిపిస్తాయన్నారు.
ప్రజలు ఓటు వేస్తే డిసెంబర్ 3 విజయాత్రకు వస్తానని... లేకుంటే డిసెంబర్ 4న తన శవయాత్రకు ప్రజలు రావాలి అన్నారు కౌశిక్ రెడ్డి. కారు గుర్తుపై పోటీ చేస్తున్న తనకు ఒక్క అవకాశం ఇస్తే తన తల ప్రజల కడుపులో పెట్టుకుంటానని హుజురాబాద్‌ను కాపాడుకుంటానని అభివృద్ధి చేస్తానని అన్నారు.
మాజీ మంత్రి ఈటలపై కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈటల రాజేందర్ బీజేపీ తరఫున నిలబడ్డారు. గత ఎన్నికల సమయంలో ఈటల కారు గుర్తుపై పోటీ చేశారు. విజయం సాధించి మంత్రిగా కూడా పని చేశారు. కేసీఆర్‌తో విభేదాలు కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. చివరకు ఆయన తన పదవులన్నింటికీ రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లారు. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న కౌశిక్ రెడ్డి కారు ఎక్కారు. టికెట్ ఆశించారు. కానీ ఈటలపై గెల్లు శ్రీనివాస్‌ను పోటీకి దింపారు కేసీఆర్. ఆ ఎన్నికల్లో ఈటల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈసారి ఈటల రాజేందర్ కేసీఆర్‌పై గజ్వేల్‌లో కూడా పోటీ చేస్తున్నారు.