Mahabubnagar Locak Body MLC By Election Results: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి (Naveen Kumar Reddy) తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందారు. నవీన్ కుమార్ కు 763, జీవన్ రెడ్డికి 652 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు పడింది. మొత్తం 1,437 ఓట్లు పోల్ కాగా అందులో 27 ఓట్లు చెల్లనవిగా అధికారులు గుర్తించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అటు, కౌంటింగ్ జరుగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.


ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున నవీన్ కుమార్ రెడ్డి బరిలో నిలవగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచారు. బీజేపీ పోటీకి దూరంగా ఉంది. 1,437 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. 99.86 శాతం పోలింగ్ నమోదైంది. ఏప్రిల్ 2నే ఫలితాలు రావాల్సి ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కౌంటింగ్ తేదీని మార్చారు.


Also Read: Telangana Anthem: తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' విడుదల - రచయిత అందెశ్రీ భావోద్వేగం