Mp Seats In Ap : రాష్ట్రంలో కూటమి లెక్కలు మారుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు టీడీపీ, జనసేన మాత్రమే కూటమిగా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగుతాయని అంతా భావించారు. కానీ, ఒక్కసారిగా ఈ లెక్కలు మార్పులు వచ్చాయి. కూటమిలో చేరడంపై ఇన్నాళ్లు తాత్సారం చేస్తూ వచ్చిన బీజేపీ.. ఒక్కసారిగా కూటమిలో చేరేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. బుధవారం పొత్తుకు సంబంధించిన చర్చలు ఢిల్లీలో జరగనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీడీపీ, జనసేన కోరుకుంటున్నట్టే రాష్ట్రంలో పొత్తు కుదిరే చాన్స్‌ కనిపిస్తోంది. కానీ, ఇక్కడే ఒక చిక్కుముడి ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పొత్తుకు బీజేపీ అంగీకరిస్తూనే.. ఎంపీ సీట్లపై మెలిక పెట్టే చాన్స్‌ ఉందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో పొత్తు పెట్టుకునేందుకు మొన్నటి వరకు ఆసక్తి చూపించని అగ్రనాయకత్వం ఇప్పటికప్పుడు.. పొత్తు దిశగా చర్చలకు సిద్ధం కావడానికి కారణం కూడా.. ఎంపీ సీట్ల లెక్కలేనని చెబుతున్నారు. రాష్ట్రం నుంచి గతంలో ఎన్నడూ తీసుకోనన్ని ఎంపీ సీట్లను తీసుకోవాలని బీజేపీ అగ్రనాయకులు భావిస్తున్నట్టు చెబుతున్నారు. 


వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు పొందేలా


వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమైన బీజేపీ.. కూటమి నుంచి భారీగా ఎంపీ సీట్లను సాధించుకోవాలని భావిస్తోంది. గతంలో తెలుగుదేశం, బీజేపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 15 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. అప్పుడు తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపించింది. దీంతో 15 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలను మాత్రమే అప్పుడు బీజేపీకి టీడీపీ కేటాయించింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉంది. కానీ, ఇప్పుడు జనసేన పోటీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాత్రం ఎంపీ స్థానాలను అధికంగా కోరుతున్నట్టు చెబుతున్నారు. కనీసం 25 ఎమ్మెల్యే, ఎనిమిది నుంచి పది ఎంపీ స్థానాలు కావాలని బీజేపీ అగ్రనాయకత్వం కోరుతున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు చర్చలు జరిపేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం పంపించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత జనసేన అధినేతతో కూడా బీజేపీ నాయకులు చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు దృష్ట్యా బీజేపీ ఇంచుమించు సగం పార్లమెంట్‌ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ అంగీకరిస్తుందా..? అన్నది వేచి చూడాలి. ఒకవేళ తెలుగుదేశం, జనసేన అందుకు సానుకూలతను వ్యక్తం చేయకపోతే ఏం జరుగుతుందన్న దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. గడిచిన రెండేళ్ల నుంచి పొత్తుపై ప్రచారానికి.. రెండు రోజుల్లో పుల్‌స్టాప్‌ పడనుంది.