BJP News: ఏపీలో బీజేపీ పోరుకు సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జోరు పెంచింది. ఒకపక్క బీజేపీ అధిష్టానం టీడీపీ, జనసేనతో పొత్తు చర్చలను సాగిస్తుండగా, రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 27న బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏలూరులో ప్రజా పోరు పేరుతో బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఈ సభకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరుకానున్నారు. ఈ సభకు హాజరయ్యే రాజ్‌నాథ్‌ సింగ్‌ క్లస్టర్‌లోని ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఏలూరు, కాకినాడ, అమలాపురం జిల్లాల పరిధిలోని బీజేపీ నాయకులు, బూత్‌ కమిటీ సభ్యులతో భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సభ నిర్వహించనున్న స్థలాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ప్రధాన కార్యదర్శి గారాపాటి సీతారామాంజనేయ చౌదరి తదితరులు పరిశీలించారు. సభకు భారీ ఎత్తున జన సమీకరణకు బీజేపీ జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. 


ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు


సభ వేదికగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే అవకాశముంది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు వైఫల్యాలపై సభ వేదికగా విమర్శలు గుప్పించనున్నారు. ప్రధానంగా మద్యపాన నిషేదం, రైతులను ఆదుకునేందుకు మూడు వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పిన ధరల స్థిరీకరణ నిధి వంటి అంశాలను ప్రశ్నిస్తూ తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశముంది. అదే సమయంలో గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి చేసిన మేలు, ఆర్థికంగా అందించిన సహకారం తదితర అంశాలను ప్రజలకు సభా వేదికగా తెలియజేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సహకారాన్ని అందించిందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజ్‌నాథ్‌ కేడర్‌కు సబా వేదికగా సూచించే అవకాశముంది. 


స్పష్టత వచ్చేనా


బీజేపీ ఏలూరులో నిర్వహిస్తున్న సభ కంటే ముందుగానే పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశముందని చెబుతున్నారు. పొత్తుపై స్పష్టత వచ్చే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను సభా వేదికగా పరిచయం చేసే అవకాశముంది. పొత్తుపై స్పష్టత రాకపోతే మాత్రం బీజేపీ విధానాలను ప్రజలకు తెలియజేయడంతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు, విమర్శలకు సభలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో బీజేపీ అగ్రనేత హాజరవుతున్న సభ కావడంతో రాజకీయంగాను ప్రాధాన్యత సంతరించుకుంది. కనీసం రెండు లక్షల మందితో సభను నిర్వహిస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.