Attack On Sirisha Barrelakka: కొల్లాపూర్: ఎన్నికల ప్రచారం (Telangana Elections 2023)లో నిన్న మొన్నటివరకూ బీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థులపై అక్కడక్కడా దాడులు జరిగాయి. తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష (Barrelakka Karne Sirisha) ఎన్నికల ప్రచారంపై దాడి జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బర్రెలక్క (శిరీష) సోదరుడిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కొందరు ఉద్యోగార్థులు శిరీషకు మద్దతు తెలిపి ఆందోళనకు దిగారు. తాము ఏం పాపం చేశామని, ఏం తప్పు చేశామని మాపై దాడి చేస్తున్నారంటూ బర్రెలక్క కన్నీటి పర్యంతమైంది.
అసలేం జరిగిందంటే..
బర్రెలక్క అలియాస్ శిరీష కొల్లాపూర్ (Kollapur) నియోజవర్గం నుంచి ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలోకి దిగింది. గతంలో ఉద్యోగాలు రావడం లేదని, అందుకు ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమే కారణమని శిరీష ఆరోపించింది. అసలే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కావడంతో ఆమె చేసిన వీడియో వైరల్ అయింది. పెద్ద చదవులు చదివినా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో జాబ్ రాలేదని, అందుకే తాను బర్రెలు కాస్తున్నానని చెప్పడం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ మద్దతుదారులు కొందరు శిరీష కుటుంబాన్ని టార్గెట్ చేశారు. వారిపై కేసులు పెట్టి వేధించారని, బెదిరింపులకు పాల్పడ్డారని సైతం శిరీష గతంలో పలుమార్లు చెప్పింది.
ఈ క్రమంలో బర్రెలక్క కొల్లపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచింది. ఆమె నామినేషన్ ఉపసంహరించుకోవాలని సైతం బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. యువత రాజకీయాల్లోకి రావాలని, మార్పు కోరుకుంటున్న తనకు ఓటు వేయాలని వినూత్నంగా ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో మంగళవారం శిరీష తన టీమ్ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, కొందరు దాడికి పాల్పడ్డారు. శిరీష సోదరుడిపై ఇద్దరు స్థానిక యువకులు దాడి చేసి అతడి ముఖంపై కొట్టారు. కత్తులతో సైతం పొడవాలని చూశారని బాధితులు ఆరోపించారు. పక్కన ఉన్న మరికొందరు అడ్డుకోవడంతో దాడిచేసిన యువకులు అక్కడినుంచి పరారయ్యారు.
పోలీసులు తమకు న్యాయం చేయాలని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష ఆరోపించారు. తనపై ఏ పార్టీ వారు దాడి చేశారో అర్థం కావడం లేదని, కానీ తన వల్ల ఓట్లు చీలే అవకాశం ఉందని తమపై దాడి చేశారని చెప్పారు. నామినేషన్ ప్రక్రియ ముగిసేవరకు ఆమె నామినేషన్ వెనక్కి తీసుకోవాలని బెదరింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, హత్యాయత్నం చేస్తున్నారని శిరీష ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రచారంలో దూసుకెళ్తున్న బర్రెలక్క..
ఎన్నికల కమిషన్ స్వతంత్ర అభ్యర్థి శిరీషకు విజిల్ గుర్తు కేటాయించారు. శిరీష ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసి తెలంగాణతో పాటు ఏపీలోనూ బర్రెలక్కకు క్రేజ్ పెరిగింది. నిరుద్యోగులు చందాలు వేసుకుని నియోజకవర్గంలో ఆమె విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. బర్రెలక్క మీద చేసిన పాట సైతం వైరల్ గా మారడంతో యువత నుంచి ఆమెకు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రచారంలో దూసుకెళ్లింది. నియోజకవర్గంలో నిన్నటినుంచి బర్రెలక్క విషయం మరింత పాపులర్ అయిన క్రమంలో వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు ఎన్నికల ప్రచారంలో ఆమె సోదరుడిపై దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
బర్రెలక్క ప్రచారం కోసం మాజీ మంత్రి విరాళం
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శిరీష పోటీ చేస్తోంది. ఆమె ఎన్నికల ప్రచారం కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు శనివారం రూ.లక్ష విరాళం పంపించారు. ఈ సందర్భంగా ఆమెకు తన అభినందనలు తెలిపారు.