Pawan Kalyan Election Campaign in Telangana: తెలంగాణలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్ (BRS) సహా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం ముమ్మరం చేశాయి. రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ఆయా పార్టీల నేతలు, అభిమానులు, శ్రేణులు ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ (Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amitshah) ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆ పార్టీ అగ్ర నేతలు సైతం నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రజలతో మమేకమవుతున్నారు. తాజాగా, బీజేపీ (BJP) తరఫున పవన్ కల్యాణ్ (Pawankalyan) ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అలాగే, తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగానూ ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సిటీలో రోడ్ షోలో ప్రసంగించనుండగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను నేతలు పూర్తి చేశారు. అనంతరం వరంగల్ తూర్పు అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు తరఫున కూడా ప్రచారం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 23న (గురువారం) కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో ప్రచారంలో పాల్గొంటారు. అలాగే, ఈ నెల 25న తాండూరులో (Tanduru) జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ కు మద్దతుగా, 26న కూకట్పల్లి జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రధాని మోదీ పాల్గొనే సభల్లోనూ పవన్ పాల్గొననున్నారు. ఈ నెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీ హాజరు కాగా, పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.


8 స్థానాల్లో పోటీ


తెలంగాణ ఎన్నికల సందర్భంగా బీజేపీ - జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో జనసేన రాష్ట్రంలో 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. అదే సమయంలో బీజేపీ పోటీ చేస్తున్న 111 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల అగ్ర నాయకులు తమ అభ్యర్థుల తరఫున విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అయితే, ఉమ్మడి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పవన్ ఎలా ఓటర్లను ఆకట్టుకుంటారనేది ఆసక్తిగా మారింది. అటు, బీజేపీ, జనసేన శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. 


గెలిచే స్థానాలపై ఫోకస్


రాష్ట్రంలో గెలుపు అవకాశాలున్న స్థానాలపై బీజేపీ నేతలు గట్టి ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులతో ఎప్పటికప్పుడు సమన్వయం అవుతూ, అగ్ర నేతలను అక్కడ రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేయగా, హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ నెల 18న వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలకు సంబంధించిన ‘సకల జనుల విజయ సంకల్ప సభ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం జనగామ సభలోనూ ఆయన పాల్గొన్నారు.