Ap High Court Verdict Reserved On Welfare Schemes Funds Release: రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు సంబంధించిన పిటిషన్ పై హైకోర్టులో (Ap High Court) వాదనలు ముగిశాయి. కాగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిధుల విడుదలకు ఈసీ (Election Commission) బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, చేయూత, పంట నష్ట పరిహారం చెల్లింపులకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్ణయంపై అభ్యంతరం తెలిపిన లబ్ధిదారులు కొందరు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మరోసారి ఈసీకి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని తెలిపింది. గురువారం ఇరువర్గాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసింది.


'ఓటర్లు ప్రభావితం కావొచ్చు'


జనవరి నుంచి మార్చి 16 వరకూ వివిధ పథకాలకు బటన్ నొక్కి.. అప్పుడు నిధులు విడుదల చేయకుండా ఎన్నికలకు రెండు రోజుల ముందు నిధులు ఎలా విడుదల చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. అటు, సైలెంట్ పీరియడ్ లో నిధులు విడుదల చేసేందుకు వీలు లేదని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ఈ సమయంలో నిధుల విడుదలకు అనుమతి ఇస్తే ఓటర్లు ప్రభావితం కావొచ్చని పేర్కొంది. అయితే, ఈసీ వాదనలపై స్పందించిన లబ్ధిదారుల తరఫు న్యాయవాదులు తాము ముందు షెడ్యూలైన పథకాల డబ్బులనే ఇస్తున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కాగా, ఈ నెల 14న నిధులు విడుదల చేసుకోవచ్చని ఈసీ తరఫు న్యాయవాది చెప్పారు. గతంలో తాము జూన్ 6 వరకూ నిధుల విడుదలకు వీలు లేదని చెప్పినా.. తాజాగా మాత్రం పోలింగ్ పూర్తైన తర్వాత నిధులు విడుదల చేసుకోవచ్చని చెబుతున్నట్లు  కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది.


సీఎస్ కు ఈసీ లేఖ


మరోవైపు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బుల జమపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తైన తర్వాతే డబ్బులను లబ్ధిదారులకు జమ చేయాలని స్పష్టం చేసింది. మే 13న పోలింగ్ తర్వాత డబ్బులు జమ చేసేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఈసీ.. 2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది. ఈ జాప్యంపై వివరణతో కూడిన నివేదికను ఈ నెల 10లోపు ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించింది. ఈ క్రమంలో మొత్తం 6 పథకాలకు సంబంధించి సీఎం జగన్ ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే విషయంపై లేఖలో ప్రస్తావించిన ఈసీ.. మొత్తంగా రూ.14,165 కోట్లకు సంబంధించి నిధులు విడుదలకు బటన్ నొక్కారని తెలిపింది. అయితే, ప్రచారం పూర్తైన తర్వాత పోలింగ్ కు ముందు 11, 12 తేదీల్లో నిధుల విడుదలయ్యేలా చూశారన్న సమాచారం తమకు ఉందని లేఖలో వెల్లడించింది. 


Also Read: Chandrababu Comments : జనవరిలో బటన్ నొక్కి ఇప్పటి వరకూ ఎందుకు డబ్బులు ఇవ్వలేదు - జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న