Election Commission Key Decision On Schemes Money Transfer: రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బుల జమపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తైన తర్వాతే డబ్బులను లబ్ధిదారులకు జమ చేయాలని స్పష్టం చేసింది. మే 13న పోలింగ్ తర్వాత డబ్బులు జమ చేసేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. ఎన్నికల కోడ్ కంటే ముందుగానే పలు పథకాలకు సీఎం జగన్ (CM Jagan) బటన్ నొక్కారని ఈసీ పేర్కొంది. దీనిపై ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయగా.. ఆ వినతిని తిరస్కరించింది.
ఈసీ ఏం చెప్పిందంటే.?
'సంక్షేమ పథకాల నగదు డీబీటీతో వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు చేరుతున్నా నిధుల జమ ఎందుకు ఆలస్యమైంది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రచారం ముగిశాక జమ చేసే యత్నం జరుగుతోంది. పోలింగ్ కు 2 రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుంది. ఎన్నికలు పూర్తయ్యాకే ఆ నిధులు జమ చేయాలి.' అని ఈసీ తెలిపింది. డబ్బులకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఈసీ.. 2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది. ఈ జాప్యంపై వివరణతో కూడిన నివేదికను ఈ నెల 10లోపు ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించింది. ఈ క్రమంలో మొత్తం 6 పథకాలకు సంబంధించి సీఎం జగన్ ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే విషయంపై లేఖలో ప్రస్తావించిన ఈసీ.. మొత్తంగా రూ.14,165 కోట్లకు సంబంధించి నిధులు విడుదలకు బటన్ నొక్కారని తెలిపింది. అయితే, ప్రచారం పూర్తైన తర్వాత పోలింగ్ కు ముందు 11, 12 తేదీల్లో నిధుల విడుదలయ్యేలా చూశారన్న సమాచారం తమకు ఉందని లేఖలో వెల్లడించింది. ఈసీ తాజా ఆదేశాలతో పోలింగ్ తర్వాతే లబ్ధిదారుల ఖాతాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
మరోవైపు, నగదు జమ చేయకుండా.. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ సాగింది. వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చినట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, దీనిపై స్పందించిన ఈసీ పోలింగ్ తేదీ తర్వాతే నగదు లబ్ధిదారుల ఖాతాకు జమ చేయాలని కోర్టుకు తెలిపింది.