Telugu Desam Party News : రాజకీయాల్లో డబ్బు పోగొట్టుకోవడం తప్ప...కొందరికి సంపాదించడం చేతకాదని తెలిసినా వస్తుంటారంటున్నారు విశాఖ తెలుగుదేశం లోక్‌సభ అభ్యర్థి శ్రీభరత్ (Sri Bharath). నష్టపోతామని తెలిసినా...ఒకసారి రాజకీయాల్లోకి వస్తే తిరిగి వెనక్కి వెళ్లడం సాధ్యకాదన్నారు. గీతం వర్సిటీ భూ ఆక్రమణలు, లోకేశ్(Lokesh) రెడ్‌బుక్ బెదిరింపులపై తన మనసులోమాటను ఏబీపీ దేశంతో పంచుకున్నారు.
విశాఖ లోక్‌సభ కూటమి అభ్యర్థి శ్రీభరత్‌తో ముఖాముఖి
ఏబీపీ దేశం: వైసీపీ ఏ బెదిరింపు రాజకీయాలు చేసిందో..ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే బాటలో నడుస్తోంది కదా..? లోకేశ్ సైతం పదేపదే రెడ్‌బుక్ చూపిస్తూ బెదిరిస్తున్నారు కదా...?
శ్రీభరత్ : తెలుగుదేశం పార్టీ(TDP) ఎప్పుడూ బెదిరింపు రాజకీయాలు గానీ, కుల రాజకీయాలు గానీ చేయదు. వైసీపీ(YCP) వేరు, మేం వేరు...వైసీపీ పూర్తిగా కమ్మ వ్యతిరేక పార్టీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 5 నుంచి 6 శాతం ఉన్న కమ్మ సామాజికవర్గం మొత్తంపై జగన్ కక్షగట్టారు. ఇక లోకేశ్(Lokesh) అన్న పదేపదే రెడ్‌బుక్ చూపి చెప్పేది....తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని. వైసీపీ నేతల అండ చూసుకుని నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం నేతలపై కక్షసాధింపులకు పాల్పడిన అధికారులు, నేతలను విడిచిపెట్టబోమనే చెప్పారు. అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుల్లో ధైర్యం నింపేలా, నష్టపోయిన వారికి అండగా ఉంటామనేలా ఆయన కొంచెం స్వరం పెంచి చెప్పారే తప్ప ఎలాంటి కక్షసాధింపు చర్యలకు తెలుగుదేశం పాల్పడదు. అలాగే తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది కూడా లేదు.
ఏబీపీ దేశం: : సీఎం జగన్(Jagan) సహా వైసీపీ నేతలంతా కమ్మ సామాజికవర్గాన్ని నేరుగా టార్గెట్ చేసినా...కమ్మసామాజికవర్గం ఎందుకు ధీటుగా ఎదుర్కొలేకపోయింది..?
శ్రీభరత్: గత ఎన్నికలకు ముందు జగన్ పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించారు. కానీ అవన్నీ అబద్ధాలని తెలుసుకోవడానికి ప్రజలకు ఎంతో సమయం పట్టలేదు. తిరుమలలో పింక్‌డైమండ్ పోయిందంటూ హడావుడి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసే ఎత్తలేదు. అలాగే గత ప్రభుత్వ హయాంలో డీఎస్పీ(DSP) పోస్టుల్లో ప్రమోషన్లన్నీ కమ్మ సామాజికవర్గం వారికి ఇచ్చారంటూ అసత్య ప్రచారం చేశారు. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలదీస్తే కేవలం ముగ్గురు, నలుగురు మాత్రమే ఉన్నారంటున్నారు. జగన్ హయాంలో కీలక పోస్టులన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాబట్టి కాలమే అన్నిటీకీ సమాధానం చెబుతుంది. ప్రజలు ప్రతి ఒక్కటీ గమనిస్తూనే ఉంటారు.
ఏబీపీ దేశం: ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. గెలిచిన తర్వాత ఇవన్నీ రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప...ప్రజాసేవ చేయాలని ఎవరు అనుకుంటారు..?
శ్రీ భరత్: ప్రస్తుత కాలంలో రాజకీయాల నుంచి డబ్బును వేరుచేయడం సాధ్యం కాదు. ఎన్నికల ఖర్చు బాగా పెరిగిపోయింది. కాబట్టి గెలిచిన తర్వాత ఎవరైనా తాను ఖర్చు చేసిన మొత్తం తిరిగి రాబట్టుకోవాలనే చూస్తారు. కానీ ఎంపీలకు సంపాదించుకునేందుకు పెద్దగా స్కోప్ ఉండదు. ఇది తెలిసి కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటే నష్టపోవడానికే. రాజకీయం అనేది ఒక వ్యసనం లాంటిదే. ఇక్కడ పెట్టిన ఖర్చు, సమయాన్ని వారి వ్యాపారంలో వృద్ధి కోసం పెట్టి ఉంటే తక్కువలో తక్కువ ఐదేళ్లలో దాదాపు రూ.300 కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ అవన్నీ వదులుకుని వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరిలో కొందరికి డబ్బుమీద వ్యామోహం కన్నా...ప్రజాసేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకునే వారు కూడా ఉంటారు. అలాంటివారిలో నేను కూడా ఒక్కడిని. నాకు డబ్బు సంపాదనపై ఎలాంటి ఆశ లేదు. రాజకీయాలు మానుకోలేను.
ఏబీపీ దేశం: రుషికొండ(Rushikonda)ను జగన్ బోడికొండ చేశారని మీరు ఆరోపిస్తున్నారు. కానీ మీరు కూడా రుషికొండకు ఎదురుగా ఉన్న కొండను ఆక్రమిం చేశారు అనేది వైసీపీ ఆరోపణ. ఇప్పటికీ గీతం భూముల్లో ప్రభుత్వ భూమి ఉందంటున్నారు..?
శ్రీభరత్: గీతం వర్సిటీ(Geetham University) భూముల్లో 8 నుంచి 9 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నమాట వాస్తవమే. కానీ మేం ఎలాంటి కొండలు ఆక్రమించి కొల్లగొట్టలేదు. ఎప్పుడో 30 నుంచి 40 ఏళ్ల క్రితమే మా వర్సిటీ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి మా ఆధీనంలోకి వచ్చింది. అది ఎలా వచ్చింది, ఏంటీ అన్న సంగతి నాకు కూడా తెలియదు. మా తాతగారి హయాంలో జరిగిన వ్యవహారం ఇదంతా. అయినా మేం ఆ భూమిని ఆక్రమించుకోవాలని ఏం చూడలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వానికి పరిహారం చెల్లించి ఆ భూమిని కొనుగోలు చేయాలనకున్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే 2006-07లో ఈ భూమి రెగ్యులరైజేషన్ చేయాలని ధరఖాస్తు చేశాం. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లిస్తామని చెప్పినా....అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని మాట ఇచ్చి మోసం చేసింది. ఆ తర్వాత ఈ ఫైల్ ముందుకు సాగలేదు.
నగేశ్: ప్రభుత్వ భూమిని మీకు ఇవ్వాలని కోరడం తప్పుకాదంటారా...?
శ్రీభరత్: ఇందులో తప్పేముంది....అమరావతిలో వర్సిటీలు ఏర్పాటు చేస్తామంటే తెలుగుదేశం హయాంలోనే S.R.M, V.I.T. సంస్థలకు ప్రభుత్వం నామమాత్రపు ధరలకు 150 ఎకరాలు కేటాయించింది. మా గీతం వర్సిటీ కూడా డీమ్డ్ యూనివర్సిటీనే కదా...దాదాపు ఇక్కడ 16 వేలమంది చదువుకుంటున్నారు. అలాంటప్పుడు మేం భూమి కోరడంలో తప్పేముంది. పైగా ఫ్రీగా ఇవ్వమని కూడా మేం అడగడం లేదు కదా...ప్రభుత్వ ధర చెబితే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి విద్యాసంస్థలకు భూములివ్వకూడదన్న పాలసీ ఏదైనా ఉందనుకుంటే....ఇటీవలే మా యూనివర్సిటీకి సమీపంలోనే ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 11 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. గీతం యూనివర్సిటీ వద్ద ఎకరం రూ.50 కోట్లు ఉందని...భరత్ భూములు ఆక్రమించి వందల కోట్లు కొట్టేశారంటూ పదేపదే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ లెక్క ప్రకారం ఆ స్కూల్‌కు ఇచ్చిన భూమి విలువు రూ.550 కోట్లు. మరి కేవలం ఎకరం కోటి రూపాయలకే అప్పనంగా అప్పగించారు. మరి మిగిలిన రూ.500 కోట్లు ఎవరు మింగేశారో వైసీపీ నేతలే చెప్పాలి.