Elections 2024 : ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీకి ఊహించని నష్టం కలుగుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలను అందుకున్న వారే తమ స్టార్ క్యాంపెయినర్లని చెబుతున్నారు కానీ..  రూ. 14 వేల కోట్లకు సంబంధించిన పథకాల నిధులు విడుదల చేయలేదు. జనవరి నుంచి పెండింగ్ లో ఉన్న పథకాల నిధులు పోలింగ్ రోజు జమ చేస్తామని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. అంత పెద్ద మొత్తం ప్రభుత్వం వద్ద ఉన్నాయో లేవో కానీ ఈసీ పోలింగ్ రోజున డబ్బులు జమ చేయడానికి అంగీకరించదు. పోలింగ్ అయిపోయిన తర్వాత జమ చేసుకోమని చెబుతుంది. అదే చెప్పింది. ఆ విషయం దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న  సీఎం జగన్‌మోహన్ రెడ్డికి తెలియనిది కాదు.


పోలింగ్ రోజు లేదా ముందు రోజు జమ చేస్తామని ఈసీని అడిగిన పథకాల్లో ఆసరా పథకం కూడా ఉంది. ఈ పథకానికి డబ్బులు జమ చేసినట్లుగా జనవరి ఇరవై  మూడో తేదీన  బటన్ నొక్కారు. డ్వాక్రా మహిళలకు ఈ నిధులు జమ చేయాల్సి ఉంది. కానీ ఒక్కరి ఖాతాలోనూ నగదు జమ కాలేదు. ఫబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇలా మూడు నెలలు గడిచినప్పటికీ నిధులు  జమ చేయలేదు. కోడ్ వచ్చిన తర్వాత పోలింగ్ ముందు జమ చేస్తామని అడగడంతో అంత అత్యవసరం ఏముందని  పోలింగ్ తర్వాత జమ చేసుకోమని ఈసీ చెప్పింది. అలాగే పెండింగ్ ఉన్న  పథకాల నిధులు కల్యాణమస్తు, షాదీ తోపా పథకాలకు రూ. 78 కోట్లు, ఫీజురీఎంబర్స్ మెంట్ పథకం అయిన విద్యాదీవెన కింద రూ. 708 కోట్లు,  రైతుల ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ. 1294 కోట్లు, వైఎస్ఆర్ చేయూత కింద జమ చేయాల్సిన రూ. 5060కోట్లు , అలాగే ఈబీసీ నేస్తం కోసం జమ చేయాల్సిన రూ. 629 కోట్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. 


ఈ పథకాలకు జగన్ బటన్ ఎన్నికల కోడ్ రాకముందే నొక్కారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవు.. వచ్చిన తర్వాత కూడా జమ చేయలేదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త అప్పులు తీసుకునే చాన్స్ రావడంతో వీలైనంత వరకూ అప్పులు చేశారు. అలాగే మరో చోట రూ. ఏడు వేల కోట్లు అప్పు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ మొత్తం అంతా కలిసి ఇప్పుడు ప్రజల ఖాతాల్లో వేయాలనుకుంటున్నారు. సానీ ఎన్నికల సంఘం ఆదేశాలతో  పోలింగ్ ముందు జమ చేయడానికి అవకాశం లేకపోయింది. 


పెండింగ్ పడిన పథకాలన్నీ అత్యంత కీలకమైనవే. ఆసరా పథకం కింద కనీసం కోటి మంది లబ్దిదారులు ఉంటారు.. వీరంతా మహిళలే. అలాగే చేయత పథకానికి నిధులను గత అక్టోబర్ లోనే ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. వీరంతా మహిళలే. ఇక  ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వారికీ నిధులివ్వలేకపోయారు. పోలింగ్ అయిపోయిన తర్వాత ఇస్తారన్న నమ్మకం ఓటర్లకు ఉండదు అందుకే ముందు జాగ్రత్తగా నిధులు జమ చేయలేకపోవడం వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరమేనని భావిస్తున్నారు.