Sharmila Comments On Modi Tour In Andhra Pradesh: విభజన సమయంలో ఇచ్చిన హామీలతోపాటు పదేళ్లలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చే ప్రధాని ఏపీ నుంచి కదలాలన్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి. ఏపీ ప్రజల మన్‌కీ బాత్ వినాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గిఫ్ట్ పంపించారు. అసలు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హతే మోదీకి లేదని అన్నారు. వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పి రావాలని సూచించారు.
గిఫ్ట్‌తోపాటు పదే ప్రశ్నలు కూడా మోదీకి షర్మిల సంధించారు. పదేళ్లుగా రాష్ట్రంపై కపటప్రేమ చూపిస్తున్నారని... ఇప్పుడు మళ్లీ అదే ప్రేమతో వస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోసం ఇన్ని సార్లు వచ్చిన మోదీ... అభివృద్ధి కోసం ఒక్కనాడైనా వచ్చారా అని ప్రశ్నించారు. మోదీపై ఏపి ప్రజల తరుపున ఛార్జ్ షీట్ ఇస్తున్నామన్నరు షర్మిల. బీజేపీకి, మోదీకి దమ్ముంటే ఏపి ప్రజలకు ఇప్పుడైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాలన్నారు.
10 ఏళ్లలో మోడీ చేసిన మోసాలకు షర్మిల ఇచ్చిన 10 ప్రశ్నలు ఇవే.
1) నాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని, తర్వాత మాటమరిచి రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారు
2) జగన్ రివర్స్ టెండరింగ్‌ను అడ్డుకోకుండా, పోలవరం ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికారు. ఎత్తుతగ్గించే కుట్రలు కూడా చేస్తున్నారు.
3) మీ చేతుల మీదుగా భూమి పూజ జరిపించుకున్న అమరావతి రాజధాని పదేళ్ల తర్వాత కూడా పూర్తి కాలేదు
4) పోరాటాలు, ప్రాణార్పణ ద్వారా సాకారమైన విశాఖ ఉక్కును, అక్కడి సెంటిమెంటుకు విరుద్ధంగా అమ్మేద్దామని చూస్తూ, మళ్ళీ విశాఖ మీద దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారు
5) కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటివి, విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను తుంగలోతొక్కి, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారు
6) మీ దత్తపుత్రుడు(జగన్) మద్యం సిండికేటు నడుపుతూ, కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నా మీరు ఉలకలేదు, పలకలేదు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు, ఇక్కడ మాత్రం ఎటువంటి చర్యలు లేవు
7) దేశంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేయడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా మీ కమిషన్లకు ఫిర్యాదులు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, చర్యలూ తీసుకోలేదు.
8) ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టులు, దొంగదారిలో రాష్ట్రం చేస్తున్న అప్పులు, కేంద్ర ఇచ్చే నిధుల మళ్లింపు, ఇలా ఎటు చూసినా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నా, కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవు
9) కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చి, చేతకాక, శాంతిభద్రతల సమస్యంటూ బెదిరి వెనుతిరిగింది. ఈ విషయంలో మీ సర్కారు మిన్నకుండి కూర్చోవటం యావత్ దేశానికే అవమానం
10) దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాటయిచ్చి, మాట తప్పి, దేశ యువతను, నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసారు
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మన్ కి బాత్‌లో మోదీ కచ్చితంగా దోషే అన్నారు షర్మిల. ఈ గడ్డ మీద అడుగుపట్టిన ప్రతిసారి ఇక్కడి ప్రజలను క్షమాపణ కోరండని డిమాండ్ చేశారు.