Janasena in AP: పదేళ్ల కష్టం పటాపంచలైంది. వరుస ఓటములు ఎదురైనా... మొక్కవోని ధైర్యం.. భారీ విజయం సాధించి పెట్టింది. గాజు గ్లాసు షింకులోనే ఉండాలన్న కామెంట్లకు.. గట్టి బదులిచ్చింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయబావుటా ఎగరేసిన జనసేన (Janasena) పార్టీ... అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏపీ రాజకీయ చరిత్ర (AP Political History) లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగుదేశం పార్టీ (TDP)తో కలిసి.. వచ్చే ఐదేళ్లు.. అధికారం పంచుకోబోతుంది.
దటీజ్ పవన్ అనిపించారు.. పవర్ స్టార్. సినిమాల్లోనే కాదు... రాజకీయాల్లోనూ తన పవర్ చూపించారు. ఏపీలో NDA కూటమితో కలిసి.. పొత్తు ధర్మంలో భాగంగా 175 ఎమ్మెల్యే స్థానాల్లో 21 స్థానాలు మాత్రమే తీసుకున్నారు. అలాగే.. 25 ఎంపీ స్థానాల్లో రెండింటిలో మాత్రమే పోటీ చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే.. సీట్లు తగ్గించుకున్నానని చెప్పారాయన. 21 ఎమ్మెల్యే సీట్లలో కనీసం 18 సీట్లు వస్తాయని ఆశించారు. కానీ... ఊహకు అందని ఫలితాలు జనసేన సొంతమయ్యాయి. గాజు గ్లాసు కనిపించిన చోటల్లా ఓట్ల వర్షం కురిసింది. జనసేన అభ్యర్థులు... భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఏపీలో అవినీతి, అరాచకం పెరిగిపోయిందని.... అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఓటమే లక్ష్యంగా పెట్టుకున్నామని మొదటి నుంచి చెప్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ (Pavan Kalyan). వైఎస్‌ఆర్‌సీపీపై యుద్ధం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని చెప్పారు. అన్నట్టుగానే చేసి చూపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసమంటూ... కూటమిగా ఏర్పడ్డారు. తెలుగుదేశం పార్టీతో జతకట్టారు... బీజేపీ పెద్దలను ఒప్పించింది... పొత్తులో భాగం చేసేందుకు చాలా కష్టపడ్డానని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. అందుకు ఎన్నో తిట్లు తిన్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కూటమిగా ఏర్పడిన తర్వాత... పొత్తులో భాగంగా... సీట్లు తగ్గించుకున్నారు. 21 సీట్లు మాత్రమే తీసుకున్నారేంటని..? అందరూ ప్రశ్నించినా... రాష్ట్ర భవిషత్ కోసం... తగ్గిన పర్వాలేదన్నారు. పోటీ చేసిన స్థానాలు తక్కువే అయినా... 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆదేశించారు పవన్ కళ్యాణ్. కానీ... ఏపీ ప్రజలు... ఎవరూ ఊహించని విధంగా... జనసేనకు తిరుగులేని విజయం అందించారు. 100 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీచేసిన పవన్ కళ్యాణ్... సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు కంటే ఎక్కువగా... 70వేల 279 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు... జనసేన అభ్యర్థులంతా మంచి మెజార్టీతో విజయం సాధించారు.
పవన్ గెలిచిన ఎమ్మెల్యే సీట్లు
నియోజకవర్గం | ఎమ్మెల్యే పేరు | సాధించిన మెజార్టీ | |
1 | పాలకొండ | జయకృష్ణ నిమ్మక | 13291 |
2 | నెల్లిమర్ల | లోకం నాగమాధవి | 39829 |
3 | విశాఖ పట్నం సౌత్ | వంశీకృష్ణ శ్రీనివాస్ | 64594 |
4 | అనకాపల్లి | కొణతాల రామకృష్ణ | 65764 |
5 | పెందుర్తి | పంచకర్ల రమేష్‌బాబు | 81870 |
6 | యలమంచిలి | సుందరపు విజయ్ కుమార్ | 48956 |
7 | పిఠాపురం | పవన్ కల్యాణ్ | 70279 |
8 | కాకినాడ రూరల్ | పంతం వెంకటేశ్వరరావు(పంతం నానాజీ) | 72040 |
9 | రాజోలు | దేవ వరప్రసాద్ | 39011 |
10 | గన్నవరం | గిడ్డి సత్యనారాయణ | 33367 |
11 | రాజానగరం | బత్తుల బలరామకృష్ణ | 34049 |
12 | నిడదవోలు | కందుల దుర్గేష్ | 33304 |
13 | నర్సాపురం | బొమ్మిడి నారాయణ నాయకర్ | 49738 |
14 | భీమవరం | రామాంజనేయులు పులపర్తి | 66974 |
15 | తాడేపల్లిగూడెం | బొలిశెట్టి శ్రీనివాస్ | 62492 |
16 | ఉంగుటూరు | ధర్మరాజు | 44945 |
17 | పోలవరం | చిర్రి బాలరాజు | 7935 |
18 | అవనిగడ్డ | మండలి బుద్దప్రసాద్ | 46434 |
19 | తెనాలి | నాదెండ్ల మనోహర్ | 48112 |
20 | కోడూరు | అరవ శ్రీధర్ | 11101 |
21 | తిరుపతి | ఆరణి శ్రీనివాస్ | 61956 |
జనసేన లోక్‌సభ సీట్లు
మచిలీపట్నం - బాలశౌరి
కాకినాడ - ఉదయ్
గత పదేళ్ల జనసేన రాజకీయ ప్రస్థానం...
2014లో జనసేన పార్టీ పెట్టారు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. అయితే... ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా... టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీతో కలవకుండా... ఏపీలోని 175 స్థానాలకు పోటీ చేశారు. గాజువాక, భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో... పవన్ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. జనసేన ఒక ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. గెలిచిన ఎమ్మెల్యే కూడా వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లిపోయారు. దీంతో... మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో... టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. 21 స్థానాల్లో పోటీ చేసి... 21 స్థానాలు గెలుచుకుని 100 శాతం స్ట్రైక్ రేట్‌తో కింగ్‌మేకర్‌గా నిలిచారు.