మునుగోడు ఉపఎన్నిక నవంబర్‌ 3న జరగనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడంతోపాటు ప్రచారాన్ని కూడా తీవ్ర చేశాయి. ప్రస్తుతం మునుగోడులో ఎన్నికల పండగ వాతావరణం నెలకొంది. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలతో మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల కళ సంతరించుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక తథ్యమని తేలడంతో ఒక్కసారిగా అందరిచూపు మునుగోడుపై పడింది. అప్పటి నుంచి మొదలైన హడావుడి ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో వేడి ఒక్కసారిగా పెరిగింది. దీనికి తోడు నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్ కూడా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో మునుగోడు ఉపఎన్నిక పోరు మరింత రసవత్తరంగా మారింది.


జాతీయపార్టీగా టీఆర్‌ఎస్‌ మారిన తర్వాత జరుగుతున్న తొలి ఉపఎన్నిక కావడంతో ఆపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే కెసిఆర్‌ మునుగోడులో గెలుపు కోసం సూపర్‌ ప్లాన్‌ వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వపథకాలు, అభివృద్ధిపై విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షాలకు సమాధానం చెప్పేలా మునుగోడు నియోజకవర్గంలో లబ్ది పొందుతున్న దాదాపు 4లక్షల మందికి కెసిఆర్‌ స్వయంగా లేఖలు రాయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 30న చుండూరులో జరగనున్న భారీ బహిరంగ సభలో కెసిఆర్‌ పాల్గొననున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ సభ జరగనుంది. ఈ సభ ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు కెసిఆర్‌ దీటైన సమాధానం ఇవ్వనున్నారని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్ట్‌ మొదటి వారంలో ప్రజాదీవెన సభ మునుగోడు నిర్వహించారు. ఇక ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఒక ఎమ్మెల్యేను టీఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జీలుగా రంగంలోకి దింపింది. వారు క్ష్రేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.  కేటిఆర్‌, హరీశ్‌ రావు కూడా రోడ్‌ షో ద్వారా మునుగోడు ప్రజలకు బీఆర్‌ ఎస్‌ ని గెలిపించమని కోరనున్నారట.


ఇంకోవైపు బీజేపీ కూడా మునుగోడులో కెసిఆర్‌ బహిరంగ సభకు దీటుగా ప్రజాసభని నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోందట. ఈ సభకు జాతీయ అధ్యక్ష్యుడు జేపీ నడ్డా వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సభ ద్వారా మరోసారి తెలంగాణ సిఎం కెసిఆర్‌ తీరును ప్రజలకు వివరించబోతున్నారట. కాంగ్రెస్‌ కూడా ఈ రెండు పార్టీలకు దీటుగా బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తోందట. రాహుల్‌ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించనున్న సందర్భంగా ఆయన్ని కూడా మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేలా చేయాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారట. 


ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది మునుగోడు నియోజకవర్గానికి నేతల వరద పారుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేతలు ఓటర్ల ఇంటి బాట పట్టారు. ఒక్కో ఓటు చాలా కీలకం కానుండటంతో ప్రతి ఓటర్ను టచ్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ 20 రోజులు నేతల హామీల మాటలు, తియ్యటి కబుర్లు వినాల్సిందేనని మునుగోడు ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే చైతన్యవంతమైన నియోజకవర్గం అనుకున్న మునుగోడులో తీర్పు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో మునుగోడు ఓటర్లను మెప్పించేందుకు ఆయాపార్టీల పెద్దలు రంగంలోకి దింపడమే కాకుండా వారి చేత స్వీట్ స్వీట్ మాటాలు కూడా కూయిస్తోంది మునుగోడు ఉపఎన్నిక.


మునుగోడు బై పోల్ కు నవంబర్‌ 3వ తేదీన పోలింగ్‌, 6 తేదీన కౌంటింగ్‌ జరగనుంది. ఈ గెలుపుని సెమిఫైనల్‌ గా భావిస్తోన్న ప్రధాన పార్టీలు గెలుపు మీద అంతే ధీమాగా ఉన్నాయి.