Actor Nara Rohit Election Campaigned Supprot Of Alliance: రాష్ట్ర భవిష్యత్ కోసమే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు అని టాలీవుడ్ ప్రముఖ హీరో నారా రోహిత్ (Nara Rohit) అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల (Etcherla) నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావుకు మద్దతుగా ఆయన శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపే దమ్మున్న నాయకుడు చంద్రబాబు మాత్రమేనని, విజన్ కలిగిన నేతకు ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అవినీతి, అరాచకాలకు నిలయంగా మారిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు రావాలని ఆకాంక్షించారు. ఎన్నికలు మరో పది రోజులు మాత్రమే ఉందని.. కూటమి అభ్యర్థులు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి  ఈశ్వరరావు గెలుపు కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఒక్క రైతుకైనా న్యాయం జరిగిందా.?. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రశ్నించిన వారిని అంతం చేయడమే వైసీపీ అభివృద్ధి అంటూ సెటైర్లు వేశారు. అనంతరం పలాస అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషను కలిశారు.

Continues below advertisement


'చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతా'


టీడీపీ అధినేత చంద్రబాబు ఓ సాధారణ కార్యకర్తకు ఎంపీ టికెట్ ఇచ్చారని.. తన మీద నమ్మకం ఉంచి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. చంద్రబాబు నమ్మకాన్ని తప్పక నిలబెడతానని.. ఈ ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో గెలుపొంది ఆయనకు కానుకగా ఇస్తానని చెప్పారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని అన్నారు.


అటు, వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఈ నియోజకవర్గంలో ఇంతవరకూ పోటీ చేసిన నాయకులు అందరూ కూడా నాన్ లోకల్ అని.. తొలిసారి లోకల్ అయిన తనను ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు. నారా రోహిత్ ఎచ్చెర్లకు రావడం చంద్రబాబు వచ్చినట్లుగా భావిస్తున్నామని అన్నారు. వైసీపీ  హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. రాష్ట్రంలో 250కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విజన్ ఉన్న నాయకుడు కావాలని.. అది చంద్రబాబేనని చెప్పారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.


Also Read: Pawan Kalyan : బూతులకు టాక్స్ వేస్తే నిధుల కొరతే ఉండదు - గుడివాడలో వైసీపీపై విరుచుకుపడిన పవన్