Khammam Nama Nageswara Rao :  ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో మరోసారి గెలిచేందుకు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి టీడీపీ అభ్యర్థి బరిలో లేకపోవడం.. టీడీపీ ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు తనకే మద్దతివ్వాలని ఆయన కోరుతున్నారు. గతంలో ఆయన టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మరోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ఖమ్మం బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలహీనపడింది.  కానీ నామా నాగేశ్వరరావు మాత్రం బీఆర్ఎస్ తరపునే  పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ సానుభూతిపరులు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చారని .. ఈ సారి బీఆర్ఎస్ కు ఓటేయాలని నామా కోరుతున్నారు.  ఎన్టీఆర్ స్పూర్తితో, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు.  పార్లమెంట్ లో ఎన్టీఆర్ గారి విగ్రహ ఏర్పాటు నా నేతృత్వం లో జరగడం అదృష్టంగా బావిస్తున్నానని..  ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీ గారికి లేఖ రాశానని గుర్తు చే్సతున్నారు. ఖమ్మం లో జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఎన్టీఆర్ గారికి నివాళు అర్పించి అక్కడ టీడీపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. 


మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతినేలా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారి అద్వర్యం లో వెళ్లి పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయడం జరిగిందని ఆ సమయం లో అక్కడ పోలీస్ వారు చేసిన లాఠీ ఛార్జ్ లో చంద్రబాబు గారికి తగలబోయిన లాఠీ దెబ్బకు అడ్డు వెళ్లి ఆ లాఠీ దెబ్బ తిన్న చరిత్ర తెలుగుదేశం పార్టీలో తనది అని నామా గుర్తు చేసుకున్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనాడు చేపట్టిన సైకిల్ యాత్రను, బాబు గారి పాదయాత్ర సందర్భంగా పైలాన్ ఏర్పాటు సహా పలు విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు.   ప్రస్తుతం ఉన్న రాజకీయాలను గమనించి టీడీపీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు.  


తెలుగుదేశం పార్టీతో   ఉన్న అనుబంధం ఎవరు వేరు చేయలేనిదని నామా నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు.   రాజకీయాలకు అతీతంగా టీడీపీ కుటుంబ సభ్యులకు అండగా ఉన్న భవిష్యత్ లో కూడా అండగా నిలబడుతానని హామీ ఇచ్చారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నో చోట్ల ఎన్టీఆర్ గారి విగ్రహాలు, పార్టీ కార్యాలయాల ఏర్పాటు లో నా పాత్ర ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు సహకరించాలని కోరారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఆద్వర్యంలో చేపట్టిన పోస్ట్ కార్డు కార్యక్రమం లో కేంద్రానికి పోస్ట్ కార్డు రాసి నామా నాగేశ్వరరావు  మద్దతు తెలిపారు.  


నామా నాగేశ్వరరావు ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో కానీ.. ఈ సారి టీడీపీ సానుభూతిపరులు నామా వైపు మొగ్గుచూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎన్నికల కోడ్ రాక ముందే టీడీపీ ఆఫీసుకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించాలని కోరారు