Summer Effect On Elections 2024: తీవ్రమైన ఎండల ప్రభావం ఈ సారి ఎన్నికల్లో పోలింగ్ శాతంపై పడే ప్రమాదముందని రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మే నాలుగో తేదీకే  ఏపీలో 47 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న నేపథ్యంలో మే 13న ఈ ఎండల తీవ్రత 50 డిగ్రీలను తాకే ప్రమాదం లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే ఓటింగ్ శాతంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. ఇప్పటికే 11 తర్వాత ఇంటి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇష్టపడట్లేదు. ఇక ఆ మేరకు ఎండలుంటే ఏమొస్తారోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


రాష్ట్రంలో నెల 13న జరగనున్నపోలింగ్‌ను ఎండ భయం వెంటాడుతోంది. గడిచిన నెల రోజులుగా ఏపీలో అత్యధిక  ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. తాజాగా శుక్రవారం నంద్యాల జిల్లా గోస్పాడు, బండి ఆత్మకూరులో..  47.7 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 15 జిల్లాల్లో  44 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో 13వ  తేదీన జరిగే పోలింగ్‌పై ఎండల ప్రభావం ఉంటుందని  రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి.  పోలింగ్ శాతం తగ్గితే ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉందన్న ఆందోళన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల్ని వెంటాడుతోంది.


రెండు దశల ఎన్నికలపైనా ఉంది.. 


ఎండలు, పడగాల్పుల ప్రభావం దేశవ్యాప్తంగా జరిగిన మొదటి, రెండో దశ ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. 2019లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో 69.9 శాతం ఓటింగ్ జరగ్గా..  ఈ ఏడాది ఏప్రిల్ 19 న జరిగిన తొలిదశలో 65.6 శాాతం మాత్రమే పోలింగ్ జరిగింది. అంటే 4.4 శాతం మేర ఓటింగ్ తగ్గింది. రెండోదశలో త్రిపురలో అత్యధికంగా 78.53 శాతం ఓటింగ్ నమోదవ్వగా... పశ్చిమ బెంగాల్లో 63 శాతం, మణిపూర్‌లో 77.18 శాతం పోలవ్వగా ఉత్తర ప్రదేశ్‌లో అత్యల్పంగా 53.71 శాతం పోలింగ్ జరిగింది. లోక సభ ఎన్నికలకు సంబంధించి తొలి దశలో ఎండల తీవ్రత కారణంగా ఓటింగ్ తక్కువ నమోదైందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  


గత ఎన్నికలు నెల రోజులముందే.. 


2019 ఎన్నికల్లో ఏపీలో 79.88 శాతం మేర పోలింగ్ నమోదైంది. 1,55,45,211 మంది పురుషులు, 1,57,87,559 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 3,13,33,631 మంది ఓట్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే 1.92 శాతం మేర ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఇక 2019లో ఏప్రిల్ 11 వ తేదీన ఏపీలో ఎన్నికలు జరిగాయి అంటే ఈ దఫా ఎన్నికలతో పోలిస్తే దాదాపు నెల రోజుల ముందే ఎన్నికలు జరిగాయన్నమాట.  అప్పట్లో అత్యధిక ఉష్ణోగ్రత 40 డిగ్రీలు మాత్రమే. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. 47 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  పోలింగ్‌కు తొమ్మిది రోజుల వ్యవధి ఉన్న నేేపథ్యంలో ఉష్టోగ్రతలు మరింత పెరిగే ప్రమాదమందని నిపుణులంటున్నారు. 


ఇంట్లో కూర్చొని ఓటేసేందుకు సుముఖంగా మూడు శాతం మందే.. 


మునుపెన్నడూ లేని విధంగా హోమ్ ఓటింగ్ విధాానాన్ని ఎన్నికల సంఘం ఈ సారి అందుబాటులోకి తెచ్చింది. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం అంగవైకల్యం పైబడిన దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటేసే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించింది.  రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,28,484 మంది హోం ఓటింగ్ అర్హత కలిగి ఉండగా వీరిలో 85ఏళ్లకు పైగా వయసున్న వృద్ధులు 2,11,257 మంది. 40 శాతం అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు 5,17,227 మంది ఉన్నారు.  అయితే వీరిలో కేవలం 28,591 మంది మాత్రమే హోమ్ ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. 14,577 మంది వృద్ధులు, 14,014 మంది దివ్యాంగులు వీరిలో ఉన్నారు.  అంటే కేవలం 3 శాతం మంది ఓటర్లు మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకోగా మిగతా వాళ్లు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి క్యూలో నించొని ఓటేయాల్సి ఉంటుంది. 


అభ్యర్థుల్లో ఆందోళన


రాష్ట్రంలో ఈ నెల 13న ఉదయం 7 గంటలకు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ఎండలు, వడగాడ్పుల తీవ్రత నేపథ్యంలో ఉదయం 11 గంటల తరువాత నుంచి సాయంత్రం నాలుగు వరకు బయటకొచ్చేందుకే జనం జంకుతున్నారు. పోలింగ్ రోజూ ఇదే పరిస్థితి కొనసాగితే కచ్చితంగా ఓటింగ్ శాతం తగ్గుతుందని, తద్వారా తమ బలాబలాల మేరకు ఫలితం వచ్చే అవకాశం ఉండబోదని రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.