Palamaneru constituency   : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ నాయకులలో అమర్ నాధ్ రెడ్డి ఒకరు. ఆయన పై గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫారసుతో నిలబడిన  సాధారణ నాయకుడు వెంకటేష్ గౌడ్ గెలుపొందారు.  ఈ సారి కూడా ఆయనకే  టిక్కెట్ ఖరారు చేసారు.   ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తి గా మారింది.  పలమనేరు నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు. ఇక్కడ ఉన్న మండలాల్లో చాల వరకు కర్ణాటక రాష్ట్రంలోనే ఉపాధి, ఉద్యోగాలు సాధించి ఉంటారు. పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి వెంకటగిరి కోట (వి.కోట) మండలాలు ఉన్నాయి. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,55,870 మంది ఓటర్లు ఉన్నారు. 


అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి గట్టి పట్టు 


మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి వారసత్వంగా తండ్రి నుంచి రాజకీయ ప్రవేశం చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి అమర్ నాథ్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత  మొదట కాంగ్రెస్‌కు.. వైఎస్ చనిపోయినతర్వాత  వైసీపీ గూటికి చేరి ఎమ్మెల్యే అయ్యారు.  రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లోనూ గెలిచారు.  2016 లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే హోదా లో టీడీపీ పార్టీ లో చేరారు. ఆ తరువాత జరిగిన మంత్రిమండలి సర్దుబాటు లో పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్‌, కామర్స్‌, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో ఉన్నారు.


వెంకటేష్ గౌడ్ పై వైసీపీలో అసంతృప్తి 


ఎన్.వి.జి ట్రస్ట్ పేరిట నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసీపీ పార్టీ నాయకుడిగా ఎదిగారు. సాధారణ నాయకత్వం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆయన రెండో సారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో నిలిచారు.వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ది పై ఆ పార్టీ నాయకులు అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గంలో నాయకులకు ఎలాంటి పనులు చేయలేదని. పార్టీ తరపున నామినేటెడ్ పదవులు సైతం లేవని. గతంలో నుంచి పార్టీ కోసం పని చేసిన సీనియర్లను పట్టించుకోవడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


అభివృద్ధి పనులు జరగలేదని ప్రజల ఫిర్యాదులు


నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని. అమర్ నాథ్ రెడ్డి సమయంలో వేసిన పునాదులు ఏవి చేయలేదని. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోలేదని అంటున్నారు. మరో వైపు మన రాష్ట్రం నుంచి కర్నాటక కు అధిక ధరలకు ఇసుక అమ్ముకున్నారని., వైసీపీ నాయకులు అక్రమ మద్యం తరలించేందుకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన పధకాలు, అభివృద్ధితో ప్రజలు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


గతంలో చేసిన అభివృద్ధి పనులుపై అమర్నాథ్ రెడ్డి ఆశ


అమర్ నాథ్ రెడ్డి .. తన పార్టీ నాయకులను కలుపుకోవడం లో కొంత విఫలమయ్యారని, కష్ట సమయంలో వారికి అండగా నిలబడకుండా తప్పించుకున్నారని అంటున్నారు. టీడీపీ పార్టీ గ్రామ స్థాయిలో బలంగా ఉన్న నాయకత్వ లోపం కారణంగా కొంత అసంతృప్తితో ఉన్నారు. జనసేన నాయకులు కొంత మేర ఉన్న వారు పొత్తులో భాగంగా తప్పనిసరి టీడీపీ కి మద్దతు ఇస్తున్నారు. కాగా టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రచారంలో మాత్రం  దూకుడు కనిపించడం లేదు. బీజేపీ ఊసే లేకపోవడం గమనార్హం.  గతంలో తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి.. టీడీపీ హామీలు తనను విజయం సాధించేలా చేస్తాయని అంటున్నారు. ఇద్దరు పాత ప్రత్యర్థులు  పోటీ చేస్తుండడంతో పలమనేరు రాజకీయం వేడెక్కింది.