నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసిన నీట్ పీజీ ర్యాంకుల ప్రాధాన్య క్రమాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ తాజా జాబితాను జూన్ 14న విడుదల చేసింది. మెడికల్ పీజీ(ఎండీ/ఎంఎస్) విద్యలో మొత్తం 8,667 మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులకు లోబడి ర్యాంకులు సాధించారు. పీజీ దంత వైద్య(ఎండీఎస్) విభాగంలో 672 మంది మెరిట్ ఆర్డర్‌లో ర్యాంకులు సాధించినట్లు వర్సిటీ వెల్లడించింది. మెడికల్ పీజీ ఎండీ/ఎంఎస్ కోర్సులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1200 సీట్లు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 1400 సీట్లు అందుబాటులో ఉండగా ఈ ఏడాది మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే పీజీ డెంటల్ విభాగంలో సుమారు 375 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 5న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అయితే నీట్ పీజీ స్కోరుకార్డులను మార్చి 26న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసింది. 


నీట్ పీజీ-2023 & నీట్ ఎండీఎస్-2023- ఏపీ అభ్యర్థు జాబితా 


AP PG DISPLAY LIST-2023

AP MDS DISPLAY LIST-2023

జులైలో కౌన్సెలింగ్..?
నీట్ పీజీ 2023 కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) జులై నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులుఆగస్టు 11లోపు మెడికల్ ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేలా ఉండాలి. కాగా, ఢిల్లీ ఎయిమ్స్‌తో పాటు దేశంలోని ఇతర ఎయిమ్స్‌, చండీగఢ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, పుదుచ్చేరిలోని జిప్‌మర్‌, బెంగళూరులోని నిమ్‌హాన్స్‌, త్రివేండ్రంలోని చిత్ర తిరునాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థల్లో అడ్మిషన్లకు నీట్‌ ప్రవేశ పరీక్ష వర్తించదని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ (NBE) వెల్లడించిన విషయం తెలిసిందే.


Also Read: చదువుతుంటే నిద్రవచ్చేది, కానీ ఈ టెక్నిక్ పాటించా- ABP దేశంతో NEET ర్యాంకర్ బొర్రా వరుణ్ చక్రవర్తి


నీట్ యూజీ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా..
నీట్ యూజీ-2023 పరీక్ష ఫలితాలు జూన్ 13న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఏపీకి చెందిన విద్యార్థి ఆల్ ఇండియా రెండో ర్యాంకుతో సత్తా చాటాడు. నీట్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఇద్దరూ 720/720 మార్కులు సాధించి 99.99 పర్సంటైల్‌తో అదరగొట్టారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి తర్వాత ర్యాంకు సాధించగా.. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె.యశశ్రీకి రెండో ర్యాంకు వచ్చింది. ఈ ఏడాది నీట్‌ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 11,45,976మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654మంది అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. నీట్‌కు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. 


జాతీయ ర్యాంకుల్లో మన విద్యార్థులు..
➥ మహిళల కేటగిరీలో కణి యశశ్రీ 6వ ర్యాంకు (జాతీయ ర్యాంకు 40), కల్వకుంట్ల ప్రణతిరెడ్డి 9 (జాతీయ ర్యాంకు 45), జాగృతి బోడెద్దుల 10 (జాతీయ ర్యాంకు 49), గంధమనేని గిరివర్షిత 11 (జాతీయ ర్యాంకు 51), లక్ష్మీరష్మిత గండికోట 12 (జాతీయ ర్యాంకు 52), గిలడ ప్రాచి 17 ర్యాంకు (జాతీయ ర్యాంకు 65)వ సాధించారు.


➥ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొదటి ర్యాంకు వై.లక్ష్మీప్రవర్ధనరెడ్డి (జాతీయర్యాంకు 25)


➥ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5వ ర్యాంకు తెల్లావరుణ్ రెడ్డి (జాతీయ ర్యాంకు 105)


➥ ఎస్సీ విభాగంలో 2వ ర్యాంకు యశశ్రీ (జాతీయ ర్యాంకు 40)


➥ ఎస్సీ విభాగంలో 7వ ర్యాంకు కొల్లాబత్తుల ప్రీతం సిద్ధార్థ (జాతీయ ర్యాంకు 299)


➥ ఎస్టీ విభాగంలో మొదటి ర్యాంకు ఎం.జ్యోతిలాల్ చవాన్ (జాతీయ ర్యాంకు 119) 


➥ ఎస్టీ విభాగంలో 3వ ర్యాంకు లావుడ్య మధు బాలాజీ (జాతీయ ర్యాంకు 445)


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..