తెలంగాణలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌-2023) ఫలితాలు ఆగస్టు 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 93.42 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రవేశ పరీక్షకు మొత్తం 68,422 మంది దరఖాస్తు చేసుకోగా 59,665 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసినవారిలో 55,739 మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు పొందేందుకు అర్హత సాధించారు. సీపీగెట్-2023 ఫలితాల్లో ఎప్పటిలాగా ఈసారి కూడా అమ్మాయిల హవా కొనసాగింది. మొత్తం 37,567 మంది అమ్మాయిలు పరీక్షలో అర్హత సాధించి సత్తా చాటారు. ఇక అబ్బాయిలు 18,172 మంది అర్హత సాధించారు.

సీపీగెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఈ ఏడాది నుంచి కొత్త కోర్సు..
సీపీగెట్‌ ఫలితాల వెల్లడి సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి మాట్లాడుతూ.. ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఆగస్టు 31న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహిళా వర్సిటీతోపాటు సాంఘిక సంక్షేమ గురుకులం, మరికొన్ని కళాశాలలు ఆ కోర్సు కోసం దరఖాస్తు చేశాయన్నారు. 

పీజీ కోర్సుల్లో అమ్మాయిలే అధికం.. 
ఓయూ ఉపకులపతి ఆచార్య రవీందర్‌ మాట్లాడుతూ.. గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు అధికం కావడంతో పీజీ కోర్సులకు అమ్మాయిలే అధికంగా వస్తున్నారని చెప్పారు. దీంతో వర్సిటీల్లో వారికి హాస్టళ్ల సంఖ్య పెంచాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 287 పీజీ కళాశాలల్లో 44,756 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరేందుకు 847 మంది బీటెక్‌ విద్యార్థులు పోటీపడ్డారని చెప్పారు.   

ఫలితాల వివరాలు ఇలా..

  అబ్బాయిలు అమ్మాయిలు
దరఖాస్తులు 22,468 45,954
పరీక్షకు హాజరైనవారు 19,435 40,230
పరీక్షలో ఉత్తీర్ణులైనవారు 18,172 37,567
ఉత్తీర్ణత శాతం 93.50 93.38

సబ్జెక్టులవారీగా అర్హత వివరాలు..

సబ్జెక్ట్ అర్హత సాధించిన అభ్యర్థులు
ఎంఎస్సీ కెమిస్ట్రీ 5,817
ఎంకామ్ 4,779
ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ 4,670
జువాలజీ 4,295
ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ 3,385
ఎంఏ ఇంగ్లిష్ 3,250

ALSO READ:

ఉన్నత విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీకి మార్గం 'జామ్', పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన ‘జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) 2024’ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభంకానుంది. సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 13 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది 'జామ్' పరీక్ష నిర్వహించనుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో కొత్త పీజీ కోర్సు అందుబాటులోకి, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (JNAFAU)లో కొత్త పీజీ (మాస్టర్స్) కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఎనర్జీ అండ్‌ సస్టైనబుల్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేరుతో కొత్త మాస్టర్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు శనివారం నాడు ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.కవితా దర్యాణిరావు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ, సబ్జెక్ట్‌ నిపుణుల సహకారంతో ఈ కోర్సును రూపొందించబడిందని, కోర్సులో 20 మందికి ప్రవేశాలను కల్పించనున్నట్లు తెలిపారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..