దీపావళికి కంటే ముందు బాణ సంచాపై పెద్ద డిస్కషన్ జరగడం ప్రతి ఏడాది చూస్తుంటాం. దీనిపై ప్రభుత్వ స్థాయిలోనే చర్చోపచర్చలు జరుగుతుంటాయి. ఇవేమీ పట్టించుకోని జనం తమ పని తాము చేసుకుంటారు. దీపావళి ఇంకా పది రోజులు ఉందనగానే టపాసులు కాల్చడం షురూ చేస్తారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తయారీదారులు భిన్నమైన పటాకులు మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటారు.  


ఇది ఇలా ఉంటే దీని వల్ల శబ్ధ కాలుష్యంతోపాటు గాలి కాలుష్యం కూడా పెరిగిపోతుందన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఒక మోతాదులో చేయాల్సిన పనిని విచ్చలవిడిగా చేస్తున్న కారణంగా దీపావళికి ముందు రోజు నుంచి వివిధ ప్రాంతాల్లో కాలుష్య తీవ్ర పెరిగిపోతుందన్న ఆందోళన పర్యావరణవేత్తలు, ప్రభుత్వాల్లో కనిపిస్తోంది. అందుకే ఈ కాలుష్యాన్ని వీలైనంత తక్కువ చేసేందుకు ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. బాణాసంచా కాల్చడాన్ని చాలా రాష్ట్రాలు నిషేధించాయి.


చాలా రాష్ట్రాలు ప్రమాదకరమైన, కలుషితమైన బాణసంచా కాల్చడాన్ని నిషేధించాయి, కొన్ని రాష్ట్రాల్లో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చడానికి అనుమతిస్తున్నారు. అయితే, దీనికి ఒక కాలపరిమితిని కూడా నిర్దేశించారు. గ్రీన్‌ క్రాకర్స్‌కు ఉన్న క్రేజ్ ఇప్పటికే ప్రజలలో కనిపిస్తుంది. కానీ గ్రీన్‌ క్రాకర్స్‌ అంటే ఏమిటో, అవి రెగ్యులర్‌ బాణసంచా కంటే ఎలా భిన్నమైనవో చూద్దాం.


క్రాకర్స్ కాల్చడంవల్ల భారీ కాలుష్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశం మొత్తం కలిసి టపాసులు కాల్చినప్పుడు విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుంది. బాణసంచాలో సల్ఫర్ మూలకాలు ఉంటాయి. ఇవే కాకుండా అనేక రకాల బైండర్లు, స్టెబిలైజర్లు, రిడైజింగ్ ఏజెంట్స్, ఆక్సిడైజర్లు, రంగులు ఉన్నాయి. దీనిలో రంగురంగుల కాంతి ఉంటుంది. ఇది యాంటిమోనీ సల్ఫైడ్, బేరియం నైట్రేట్, లిథియం, అల్యూమినియం, కాపర్, స్ట్రాన్షియం మిశ్రమం నుంచి ఏర్పడుతుంది. వాటిని కాల్చినప్పుడు, ఈ రకమైన రసాయనాలు అనేకం గాలిలో కలిసిపోతాయి. గాలి నాణ్యతను గణనీయంగా తగ్గిస్తాయి. శీతాకాలంలో పొగమంచు కారణంగా గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో టపాకాయలు పేల్చడం ద్వారా ఆ నాణ్యత మరింత అధ్వాన్నంగా మారుతుంది.


బాణసంచా వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) గ్రీన్‌ క్రాకర్స్‌ను కనిపెట్టింది. ఇవి చూడటానికి అచ్చం నార్మల్‌ టాపాసుల్లానే ఉంటాయి. పేల్చేటప్పుడు కూడా అదే ఫీలింగ్‌ను ఇస్తాయి. ఇందులో వాడే పదార్థాలు మాత్రం కాలుష్యానికి హాని కలిగించనవై ఉంటాయి. అందుకే వీటిని కాల్చడం వల్ల గాలి నాణ్యత ఎక్కువగా దెబ్బతినదు. ఇవి సాధారణ బాణసంచా కంటే 40 నుంచి 50 శాతం తక్కువ హానికరమైన కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. సాధారణ బాణసంచా కంటే తక్కువ హానికరం.


గ్రీన్‌ క్రాకర్స్ ఎంత కాలుష్యానికి కారణమవుతాయి?
గ్రీన్‌ క్రాకర్స్‌లో అల్యూమినియం, బేరియం, పొటాషియం నైట్రేట్, కార్బన్‌ను ఉపయోగించరు. వాటిలోని ప్రమాదకరమైన రసాయనాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఇవి పరిమాణంలో కొద్దిగా చిన్నవిగా ఉండి ధ్వనిని కూడా తగ్గిస్తాయి. గ్రీన్ క్రాకర్స్ గరిష్టంగా 110 నుంచి 125 డెసిబెల్స్ ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తుండగా, సాధారణ పటాకులు 160 డెసిబెల్స్ వరకు ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తాయి. గ్రీన్‌ క్రాకర్స్ సంప్రదాయ క్రాకర్స్ కంటే కొంచెం ఎక్కువ ఖరీదైనవి. ప్రభుత్వం లేదా ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న షాప్ నుంచి వాటిని కొనుగోలు చేయవచ్చు