NEET Paper Leak Case: నీట్‌ పేపర్ లీక్‌ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరీక్ష నిర్వహణలో ఎన్నో లోపాలున్నాయని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రీఎగ్జామ్‌ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే...పరీక్షా వ్యవస్థలో లోపాలున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడం వల్ల ఎగ్జామ్ సిస్టమ్‌లో సంస్కరణలు చేసేందుకు UPSC సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌లు, మాల్‌ప్రాక్టీస్‌లు పెరుగుతుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తిగా డిజిటల్ టెక్నాలజీతో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకుంది. అభ్యర్థులకు ఆధార్ అథెంటికేషన్‌, ఫింగర్‌ప్రింట్ తీసుకోవడం, ఫేషియల్ రికగ్నిషన్‌ లాంటి చర్యలతో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని భావిస్తోంది. సీసీ కెమెరాలో నిఘా పెంచడం, అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని వినియోగించడం, ఇ-అడ్మిట్ కార్డ్‌లపై QR కోడ్ స్కానింగ్ పెట్టడం లాంటి చర్యలు తీసుకోనున్నారు. ఎగ్జామ్ నిర్వహించిన సమయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేయనుంది.


ఏటా USPC 14 పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో  Civil Services Examination (CSE) కూడా ఉంది. వీటితో పాటు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు, ఇంటర్వ్యూలనూ నిర్వహిస్తోంది UPSC. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెక్నాలజీ అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను (PSU) బిడ్స్‌కి ఆహ్వానించింది. ఏటా రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు మాత్రమే బిడ్ వేయాలని టెండర్‌లో UPSC స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్, ఎగ్జామ్ సెంటర్‌తో పాటు ఎంత మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారన్న వివరాలు ఎగ్జామ్‌కి సరిగ్గా రెండు మూడు వారాల క్రితమే UPSC ఆయా సర్వీస్‌ ప్రొవైడర్‌లకు అందచేస్తుంది. ఇటీవల వెల్లడించిన తీర్పులో సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. NEET ఎగ్జామ్ నిర్వహణలో తలెత్తిన అవకతవకలను ప్రస్తావిస్తూ మండి పడింది. ఈ లీక్‌ వల్ల దాదాపు 150 మంది విద్యార్థులు లబ్ధి పొందారని స్పష్టం చేసిన కోర్టు ఇంకా CBI విచారణ పూర్తవలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, అందుకు సంబంధించిన ఆధారాలు చూపించడంలో విఫలమవుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. నిబంధనలు ఉల్లంఘించి పక్కా ప్రణాళికతో క్వశ్చన్ పేపర్‌ లీక్ చేశారనని బలపరిచేలా ఆధారాలు సమర్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 


ఇక పుణేలో ఓ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ వైఖరి దేశవ్యాప్తంగా పెద్ద డిబేట్‌కి తెర తీసింది. పైగా ఆమె తప్పుడు ధ్రువపత్రాలు చూపించి రిక్రూట్ అయినట్టు విచారణలో తేలింది. పూజాపై క్రిమినల్ కేసు పెట్టిన యూపీఎస్‌సీ భవిష్యత్‌లో ఆమె ఎప్పుడూ ఎగ్జామ్ రాయకుండా ఆంక్షలు విధించింది. షో కాజ్‌ నోటీసులు కూడా ఇచ్చింది. ట్రైనింగ్‌లో ఉండగానే జులుం చెలాయించింది పూజా ఖేడ్కర్. ప్రైవేట్ ఆడీ కార్‌కి బ్లూ అండ్ వైట్ లైట్‌ పెట్టించింది. VIP స్టికర్‌ పెట్టి హల్‌చల్ చేసింది. ఇవన్నీ గమనించిన పై అధికారులు ఆమెపై బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. 


Also Read: Viral News: రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన సింహాలను ఢీకొట్టిన ట్రైన్, తీవ్ర గాయాలతో విలవిల