Train Hits Lions: గుజరాత్‌లో రెండు సింహాలు రైల్వే ట్రాక్‌పైకి వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో ట్రైన్ వేగంగా దూసుకుని వచ్చి వాటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సింహాలు తీవ్రంగా గాయపడ్డాయి. రైల్వే ట్రాక్‌ల వద్ద ఇలా తరచూ ప్రమాదాలు జరిగి వన్య ప్రాణులు బలి అవుతున్నాయి. హతీగఢ్-భేసన్ మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 9 ఏళ్ల వయసున్న సింహానికి తీవ్ర గాయాలైనట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో మహువా సూరత్ ప్యాసింజర్ దాదాపు గంటపాటు నిలిచిపోయింది. అటవీ అధికారులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి వచ్చారు. ఆ రూట్‌లో ప్రమాదాలు జరిగే అవకాశముందని ముందుగానే అప్రమత్తమంగా ఉన్నారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లారు. అప్పటికే సింహం తీవ్ర గాయాలతో నేలకొరిగింది. చికిత్స అందించేందుకు తరలించారు. మరో సింహానికీ గాయాలయ్యాయి. ఈ రైల్వే ట్రాక్ వద్ద ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు మండి పడుతున్నారు. ఈ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రైల్ ఢీకొని ఏనుగు మృతి..
ఇటీవలే అసోంలో ఇలాంటి ఘటనే జరిగింది. రైల్ ఢీకొట్టడం వల్ల ఏనుగుకి తీవ్ర గాయాలయ్యాయి. చాలా సేపు ట్రాక్‌పైనే విలవిలలాడి ప్రాణాలు కోల్పోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏనుగుని గమనించి బ్రేక్ వేసేందుకు లోకోపైలట్ ప్రయత్నించాడు. కానీ...స్పీడ్ కంట్రోల్ కాకపోవడం వల్ల బలంగా ఏనుగుని ఢీకొట్టింది. రైల్‌లో ఉన్న ఓ ప్యాసింజర్ ఇదంతా వీడియో తీశాడు. అడుగు కూడా కదల్లేని స్థితిలో ఏనుగు ట్రాక్‌పైనే పడిపోయింది. కొన ఊపిరితో చాలా సేపు కొట్టుమిట్టాడి చివరకు మృతి చెందింది. రైలు బలంగా ఢీకొట్టడం వల్ల ఏనుగు కాళ్లు బలమైన గాయాలయ్యాయి. విపరీతంగా రక్తస్రావమైంది. నొప్పి తట్టుకోలేక గట్టిగా ఘీంకరించింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించినా దాని వల్ల కాలేదు. రెండు అడుగులు వేసి అక్కడే పడిపోయింది. కాసేపటికే ప్రాణాలు విడిచింది.
ఈ వరుస ప్రమాదాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే ట్రాక్‌ల వద్ద వన్య ప్రాణులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. వాతావరణం సహకరించనప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. గాయపడ్డ సింహాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు.
Also Read: NEET Row: UPSC పరీక్షా వ్యవస్థలో కీలక మార్పులు, ఇకపై అభ్యర్థులకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి!