2023-24 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్‌లో విద్య, ఉద్యోగ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇప్పటికే 157 మెడికల్ కాలేజీలు ఉండగా.. వీటిని అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం మిషన్‌ను ప్రారంభిస్తున్నారు.
రూ.1,12,898.97 కోట్ల కేటాయింపు..
ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ.1,12,898.97 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. ఇందులో రూ.44,094.62 కోట్లు ఉన్నత విద్యకు, పాఠశాల విద్యకు రూ.68,804.85 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాదికి ఉన్నత విద్యకు రూ.₹40828.35 కోట్లు, పాఠశాల విద్యకు రూ.9,752.07 కోట్లు అధికంగా కేటాయింపులు జరిపారు.
అదేవిధంగా ఫార్మాలో పరిశోధనలను ప్రోత్సహిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇందులోభాగంగా పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు ఆహ్వానించారు. ఇక వైద్యరంగంలో కొత్త కోర్సులు తీసుకురానున్నారు. తాజా పరిశోధనలపై దృష్టి సారించనున్నారు. దీంతోపాటు ఉపాధ్యాయుల శిక్షణను మెరుగుపరుస్తామన్నారు. ఇందుకోసం వైబ్రంట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్ననట్లు తెలిపారు. కోవిడ్‌లో చదువుల నష్టాన్ని భర్తీ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తామన్నారు. ఆర్థిక నియంత్రణ సంస్థను కూడా ఇందులో చేర్చనున్నారు. ప్రతి అభివృద్ధి పథకం.. చివరి ప్రజలకు వరకూ చేరాలనేదే తమ సంకల్పం అని చెప్పారు ఆర్థిక మంత్రి.
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38,800 మంది టీచర్లను నియమించనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి. ఈ ప్రకారం.. రాబోయే 3 సంవత్సరాలలో, దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల్లో 8,000 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించనున్నారు. పిల్లలు, యువత కోసం డిజిటల్ లైబ్రరీలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నేషనల్ డిజిటల్ లైబ్రరీ పంచాయతీ, వార్డు స్థాయి వరకు ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. పుస్తకాలు స్థానిక, ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉంటాయని, అలాగే వయస్సును బట్టి పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఊతం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ల ఏర్పాటుడిజిటల్ ఇండియా, ఐటీ రంగాలకు ఊతమిచ్చేందుకు మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెంటర్లను నెలకొల్పనున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ భారత్‌లో మేక్ ఏఐ, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా విజన్ వాస్తవరూపు దాల్చేలా ఈ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కటింగ్ ఎడ్జ్ అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేయడం, వ్యవసాయం, ఆరోగ్యం, నగరాల అభివృద్ధికి మెరుగైన సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేలా పరిశ్రమ ప్రముఖులనూ ఈ కార్యక్రమలో భాగస్వాములను చేస్తామని మంత్రి చెప్పారు.
స్కిల్ ఇండియా కేంద్రాలు...
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 పథకాన్ని ప్రవేశపెడుతోందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో యువత నైపుణ్యాలు పెంపొందించేందుకు 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాలను వివిధ రాష్ట్రాల్లో స్థాపిస్తామని చెప్పారు. యువత కోసం స్కిల్ యూత్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, విదేశాల్లో ఉద్యోగాలు సాధించాలని కలలు కనే విద్యార్థుల కోసం 30 స్కిల్ ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్..
నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నేరుగా సహాయం అందించబడుతుంది. ఫిన్‌టెక్ సేవలు పెంచబడతాయి, డిజి లాకర్ యుటిలిటీ చాలా పెరుగుతుంది మరియు ఇది అన్ని డిజిటల్ పత్రాలను కలిగి ఉంటుందరి ఆర్థికమంత్రి వెల్లడించారు.