UGC Recognized Sangai International University: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).. సంగై ఇంటర్నేషనల్ యూనివర్శిటీ, చురాచంద్ పూర్, మణిపూర్‌ను గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల జాబితా నుంచి తొలగించింది. సంగై యూనివర్శిటీ అందించే ఏ ప్రోగ్రాంలోనూ అడ్మిషన్ తీసుకోవద్దని విద్యార్థులకు సూచించింది. ఆ యూనివర్శిటీ తరఫున అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, డాక్టరేట్ డిగ్రీలను ప్రధానం చేయడానికి ఇక అనుమతి ఉండదని తెలిపింది. సదరు వర్శిటీ యూజీసీ నిబంధనలు పాటించడం లేదని, తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 'UGC చట్టం, 1956 సెక్షన్ 2(f) ప్రకారం, సంగై ఇంటర్నేషనల్ యూనివర్శిటీ, చురచంద్‌పూర్, మణిపూర్, UGC విశ్వవిద్యాలయాల జాబితా నుంచి తొలగించబడింది. ఈ వర్శిటీ జారీ చేసిన/ప్రధానం చేసిన ఏదైనా డిగ్రీ ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయోజనం కోసం గుర్తించబడదు/చెల్లదు.' అని తెలిపింది.






పదే పదే అడిగినా..


సంగై ఇంటర్నేషనల్ యూనివర్శిటీని మణిపూర్ ప్రభుత్వం ఒక ప్రైవేట్, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థగా స్థాపించింది. జూన్ 2015లో, విశ్వవిద్యాలయం UGC యూనివర్శిటీల జాబితాలో చేర్చింది. అయితే, తనిఖీలకు అవసరమైన సమాచారాన్ని అందించాలని కమిషన్ పలుమార్లు యూనివర్శిటీని అభ్యర్థించింది. కాగా, అవసరమైన సమాచారం అందించడం, నిబంధనలు పాటించడంలో సంగై వర్శిటీ యాజమాన్యం విఫలమైనట్లు యూజీసీ వెల్లడించింది. ఈ క్రమంలో ఎందుకు చర్యలు తీసుకోకూడదో.?. వర్శిటీల జాబితా నుంచి ఎందుకు తొలగించకూడదో.? వివరించేందుకు సైతం వర్శిటీకి అవకాశం కల్పించినట్లు తెలిపింది.


ఈ షోకాజ్ నోటీస్ కాపీని మణిపూర్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖకు కూడా పంపినట్లు యూజీసీ తెలిపింది. వెంటనే చర్య తీసుకొని వివరణ ఇవ్వాలని అభ్యర్థించింది. ఇంఫాల్ ఫ్రీ ప్రెస్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం సంగై ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ప్రధాన కార్యాలయం చురచంద్‌పూర్‌లోని రెంగ్‌కాయ్ రోడ్‌లో అద్దె భవనంలో ఉంది, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ హాజరు లేకుండా పరిపాలనా విధులను నిర్వహిస్తోందని తేలింది. 


విద్యార్థులు ఫిర్యాదులు


సంగై అంతర్జాతీయ విశ్వ విద్యాలయం ఆర్టీఐ అభ్యర్థనలను పాటించడం లేదని.. మణిపూర్ సమాచార కమిషన్ కు ఐదుగురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వివిధ మాస్టర్స్, బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్‌లో చేరిన విద్యార్థులకు కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్లు, ప్రోగ్రామ్ సమాచారం, ఇతర పత్రాల విడుదలకు సంబంధించి ఈ ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.


యూజీసీ తొలిగించిన వర్శిటీల జాబితా


ఢిల్లీ - ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, కమర్షియల్ యూనివర్శిటీ - దర్యాగంజ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ, వొకేషనల్ యూనివర్శిటీ, ADR - సెంట్రిక్ జురిడికల్ యూనివర్శిటీ,  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్శిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం)


యూపీ - గాంధీ హిందీ విద్యాపీఠం, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్శిటీ (ఓపెన్ యూనివర్శిటీ), భారతీయ శిక్షా పరిషత్


ఆంధ్రప్రదేశ్- క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్శిటీ, బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా


వెస్ట్ బెంగాల్ - ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్


కర్ణాటక - బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కేరళ, సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం


మహారాష్ట్ర - రాజా అరబిక్ యూనివర్శిటీ


పుదుచ్చేరిశ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్