Road Accidents In Ap: ఏపీలో రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదం నింపాయి. ఈ ఘటనల్లో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెం ఘాట్ లో ఓ బైక్ రాయిని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యనమదల రాంబాబు (35), ఆయన కుమారుడు ప్రశాంత్ (8) ప్రాణాలు కోల్పోయారు. భార్య, కుమార్తెకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు వద్ద బొలెరో వాహనాన్ని బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ఉన్న లంకె సూరిబాబు, వనమాడి సాయిబాబు అనే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కారు బీభత్సం


మరోవైపు, తిరుపతి జిల్లా గూడూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి సంగం థియేటర్ వరకూ పలు వాహనాలను ఢీకొని.. ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా.. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యూపీకి చెందిన వ్యక్తి మద్యం తాగి కారును నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Palnadu News: 'షాపులు క్లోజ్, ముందే అన్నీ తెచ్చిపెట్టుకోండి' - ఎన్నికల కౌంటింగ్ క్రమంలో అక్కడి ప్రజలకు పోలీస్ శాఖ అలర్ట్