రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. త్వరలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్రంలో ఉచిత శారీరక ధృడత్వ శిక్షణను పొందుతున్న కానిస్టేబుల్, ఎస్‌ఐ అభ్యర్థులకు మంత్రి హరీష్ రావు పాలు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్‌లో 1030 మందికి శిక్షణ ఇచ్చామని, జిల్లాలో 580 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, త్వరలో మరో 2వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలో వెల్లడిస్తామన్నారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కేటాయిస్తామన్నారు.
త్వరలో 7 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ..
రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి 10 రోజుల్లోపు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా మొత్తం 7 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వీటిలో 1165 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 6 వేలకు పైగా నర్సు పోస్టులతోపాటు 1569 పల్లె దవాఖానాల్లో డాక్టర్లను నియమించనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 3800 ఏఎన్‌ఎం కేంద్రాలను కూడా పల్లె దవాఖానాలుగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నిక వల్ల డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైందన్నారు. రాష్ట్రంలో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో డీపీహెచ్ పరిధిలో 751 పోస్టులు, టీవీవీపీ పరిధిలో 211 పోస్టులు, ఐపీఎం పరిధిలో 7 పోస్టులు ఉన్నాయి. వీరికి మరో పది రోజుల్లో నియామక పత్రాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
పాఠశాల విద్యాశాఖలో 134 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్
తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం భర్తీ చేసే పోస్టుల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు (గ్రేడ్-1)- 24 పోస్టులు, డైట్‌లో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, ఎస్‌సీఈఆర్‌టీలో 22 లెక్చరర్ పోస్టులు, డైట్‌లో 65 ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టనుంది. ఈ ఉద్యోగాల భర్తీకి కమిషన్ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ట్వీట్ చేశారు. ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారికి శుభవార్త. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా పాఠశాల విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు.