Child Investment Plans: తమ పిల్లలు తమ కంటే గొప్పగా, సంతోషంగా జీవించాలని ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు ఆశిస్తారు, దానికి తగ్గట్లుగా ప్రయత్నిస్తారు. అసలు, పిల్లలు పుట్టక ముందు నుంచే వాళ్ల కోసం చాలా మంది తల్లిదండ్రులు ముందుస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


ఆర్థిక ద్రవ్యోల్బణం, విద్యా ద్రవ్యోల్బణం మనం ఊహించిన దాని కంటే వేగంగా పెరుగుతున్న రోజులివి. మరో దశాబ్దం తర్వాత పిల్లల ఉన్నత విద్య, పెళ్లిళ్ల ఖర్చు ప్రస్తుత స్థాయి కంటే పది రెట్లు పెరుగుతుందని అంచనా. దీనికి తగ్గట్లుగా  చిన్నారుల సురక్షిత భవిష్యత్‌ కోసం ఇప్పట్నుంచే బలమైన, సరైన ప్రణాళిక అవసరం. దూరదృష్టి లేకుండా మీరు చేసే మదుపు, మరికొన్నేళ్ల తర్వాత ఏ మూలకూ సరిపోదు.


పిల్లల కోసం మంచి పెట్టుబడి పథకాలు
మీ పిల్లల కోసం పెట్టుబడులు పెట్టాలని చూస్తుంటే, భవిష్యత్తులో గరిష్ట రాబడిని పొందాలనుకుని భావిస్తుంటే.. కొన్ని పెట్టుబడి పథకాలు ఉన్నాయి. వాటి సమాచారం మీకు మేం అందిస్తాం, మీకు ఇష్టమైన స్కీమ్‌లను మీరే ఎంచుకోండి.


మీరు మీ పిల్లల కోసం స్వల్పకాలిక పెట్టుబడి పథకం కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ రికరింగ్‌ డిపాజిట్‌ (RD) పథకం ఒక గొప్ప ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌. ఈ పథకంలో మీరు ప్రతి నెలా కనీసం 100 రూపాయల చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఫండ్ క్రియేట్‌ చేయవచ్చు. ఇందులో మీకు 5.8 శాతం రాబడి వస్తుంది. మీరు పిల్లల పేరుతో ఈ ఖాతా ఓపెన్ చేయవచ్చు.


ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) కూడా గొప్ప పెట్టుబడి ఎంపిక. ఇందులో కూడా ప్రతి నెలా క్రమానుగత పెట్టుబడుల (SIP లేదా సిప్‌) ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును సిద్ధం చేసుకోవచ్చు. మీరు కేవలం రూ.100తో SIP ప్రారంభించవచ్చు. మీ స్థోమతను బట్టి ఇంతకంటే ఎక్కువ కూడా సిప్‌ చేయవచ్చు. సాధారణంగా, పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ల ద్వారా సంవత్సరానికి 10 నుంచి 15 శాతం వడ్డీ రేటును పొందుతారు. అయితే ఇది స్టాక్‌ మార్కెట్ రిస్క్‌పై ఆధారపడి ఉంటుంది.


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టే దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఈ స్కీమ్‌లో, మీరు ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును పొందుతారు. దీని కింద ఒక ఏడాదిలో కనిష్టం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీకు అవసరం లేదనుకుంటే మధ్యలోనూ ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది.


ఆడపిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పథకం సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana). ఈ స్కీమ్‌ కింద, మీరు రూ. 500 నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీని మీద 7.6 శాతం రాబడి తిరిగి పొందుతారు.


ఇది కాకుండా, మీ పిల్లల పేరు మీద బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) కూడా చేయవచ్చు. అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‍‌(SBI), 5-10 సంవత్సరాల FD మీద సాధారణ పౌరులకు 6.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.