తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే మూడు దశలో కౌన్సెలింగ్‌తోపాటు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ కూడా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు రౌండ్లలో కలిపి ఇప్పటిదాకా మొత్తం 1,89,046 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారంతా ఆయా కళాశాలల్లో రిపోర్ట్‌ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా భారీగా సీట్లు మిగలడంతో మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇంజినీరింగ్‌, నీట్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నందున విద్యార్థుల సౌకర్యార్థం మరో విడత 'దోస్త్‌' అడ్మిషన్లను నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈమేరకు నిర్ణయించింది. 


ఆగస్టు 19న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 'దోస్త్‌' అడ్మిషన్లపై రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల వీసీలతో కలిసి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి ఈమేరకు సమావేశమయ్యారు. ఆగస్టు 28 నుంచి అక్టోబర్‌ 15 వరకు ఈ 'స్పెషల్‌ డ్రైవ్‌' కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులందరూ దీనికి అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 9న స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌ సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. సీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో సెప్టెంబర్‌ 11 నుంచి 15 వరకు రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. 


ఈ విద్యాసంవత్సరంలో 16 సెక్టార్‌ స్కిల్‌ కోర్సులను రాష్ట్రంలోని 64 కళాశాలల్లో ప్రారంభించినట్లు ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు. అందులో 29 ప్రభుత్వ, 35 ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలున్నాయని వెల్లడించారు. అలాగే బీఎస్‌సీ కంప్యూటర్‌ సైన్స్‌ హానర్స్‌, బీఎస్‌సీ బయోటెక్నాలజీ హానర్స్‌ కోర్సులను నూతనంగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 


ALSO READ:


TS ICET: టీఎస్ ఐసెట్‌-2023 కౌన్సెలింగ్‌ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్‌ 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


'గేట్‌-2024' షెడ్యూలు వచ్చేసింది, ఆగస్టు 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఈసారి కొత్త పేపరు జోడింపు!
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్‌సీ) చేపట్టింది. 'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.  గేట్-2024 పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐఎస్సీ-బెంగళూరు షెడ్యూలును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో గేట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..