Rajinikanth Touches Yogi Adityanath Feet:


ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న దానికి సూపర్ స్టార్ రజనీకాంత్ లైఫ్ స్టైల్ ను ఉదాహరణగా చూపవచ్చు. ప్రస్తుతం ఉత్తర భారత్ పర్యటనలో ఉన్న రజనీకాంత్ శనివారం సాయంత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. లక్నోలో యూపీ సీఎం ఇంటి ముందు ఇలా కారు దిగగానే... తనకు స్వాగతం పలకడానికి వచ్చిన యోగి కాళ్లకు వినమ్రంగా నమస్కరించారు. సీఎం యోగి, రజనీని లేపే ప్రయత్నం చేసేలోగా సూపర్ స్టార్ ఆయన పాదాలకు నమస్కరం చేయడం క్షణాల్లో జరిగిపోయింది.


రజనీకాంత్ పేరు చెబితే దేశంలోనే కాదు జపాన్, మలేషియా, అమెరికా దేశాల ప్రజల ముఖాల్లో చెప్పలేని సంతోషం కనిపిస్తుంది. ఆయన సినిమా విడుదలైతే చాలు అక్కడ సైతం పండగ వాతావరణం కనిపిస్తుంది. ఆయన సినిమాల కోసం చెన్నైకి సైతం వచ్చి వీక్షిస్తుంటారు. కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న రజనీకాంత్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ఆయనను మరింతగా ప్రజల గుండెల్లో గుడి కట్టేలా చేసింది. తన జీవితకాలంలో ఎంతో మంది సీఎంలను రజనీకాంత్ కలిసి ఉంటారు. ఆయన ఇచ్చిన ఒక్క స్టేట్ మెంట్ తో జయలలిత సైతం ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని చవిచూశారు. 
అలాంటిది, రజనీకాంత్ లాంటి గొప్ప వ్యక్తి హుందాగా వ్యవహరిస్తూ యూపీ సీఎం యోగి కాళ్లకు నమస్కరించారు. యోగి వయసు 51 ఏళ్లు కాగా, సూపర్ స్టార్ వయసు 72 ఏళ్లు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే.. రజనీకాంత్ అక్కడ నమస్కరించింది యూపీ సీఎంకు కాదు.. యోగిలో గోరక్ పూర్ మాజీ పీఠాధిపతిని చూసుకున్నారు సూపర్ స్టార్. అందుకే భక్తి భావంతో ఆయన పాదాలకు రజనీకాంత్ నమస్కరించి ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 


వాస్తవానికి నేడు లక్నోలోని ఓ థియేటర్‌లో యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి రజనీకాంత్ జైలర్‌ని చూసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిమిషంలో పనుల కారణంగా యోగి థియేటర్ కు రాలేదు. డిప్యూటీ సీఎం తో కలిసి రజనీకాంత్ జైలర్ సినిమా వీక్షించారు. యూపీ సీఎం యోగి ఆహ్వానం మేరకు రాత్రి లక్నోలోని ఆయన నివాసానికి రజనీకాంత్ వెళ్లగా సాదర స్వాగతం పలికారు. కొన్ని ఆధ్యాత్మిక అంశాలపై వీరు చర్చించనట్లు తెలుస్తోంది.



బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా కేవలం 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల వసూళ్లు రాబట్టింది. 2.0 తరువాత రజనీ కెరీర్ లో తొలి వారంలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన మూవీ జైలర్. రెండో వారం సైతం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళలో హౌస్ ఫుల్ గా షోలు కనిపిస్తున్నాయి. తొలి రోజు ఈ మూవీ రూ.48.35 కోట్లు సాధించగా.. పదవ రోజు ఐదు వందల కోట్ల క్లబ్ కు చేరుతోంది. ఇప్పటి వరకు ఇండియా నెట్ కలెక్షన్స్ 244.85 కోట్లుగా ఉంది. తమిళ ఆక్యుపెన్సీ 34.53 శాతంతో ఆ రాష్ట్రంలో రూ. 184.65 కోట్లు కలెక్ట్ చేసింది. మరోవైపు సినిమా రిలీజ్ సమయానికి రజనీకాంత్ హిమాలయాలు, ఉత్తర భారత్ పర్యటనకు బయలుదేరారు.