G20 Summit in India:


జీ 20 సదస్సుపై విమర్శలు..


మోదీ ప్రభుత్వం G20 సదస్సుని కూడా ఎలక్షన్ క్యాంపెయిన్‌గా మార్చుకుంటోందని కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీజేపీపై కాంగ్రెస్ విమర్శల డోస్ పెంచుతోంది. ఈ క్రమంలోనే ఈసారి G20 సదస్సుని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్విటర్‌లో హిందీలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ సదస్సుని కూడా బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.


"G20 ని 1999లో ఏర్పాటు చేశారు. ఐరోపా సమాఖ్యతో పాటు 19 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 17 దేశాల్లో ఈ సదస్సులు జరిగాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. కానీ...బీజేపీ మాత్రం ఇదేదో గొప్ప విషయంలా ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికలతో ముడిపెట్టి రాజకీయం చేస్తోంది. జీ20 సదస్సు జరిగిన ఏ దేశం కూడా ఇలా ప్రచారం చేసుకోలేదు. ఇదంతా కావాలనే చేస్తున్న ప్రచారం. బీజేపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది."


- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ






రాజకీయం చేయడమేంటి..? 


భారత్‌ గతంలోనూ పలు ప్రతిష్ఠాత్మక సమావేశాలకు వేదిక అయిందని అన్నారు జైరాం రమేశ్. 1983లో  Non-Aligned Movement Summit తో పాటు కామన్‌ వెల్త్ కంట్రీస్ సమ్మిట్ కూడా నిర్వహించినట్టు గుర్తు చేశారు. కానీ..అప్పుడు వీటిని రాజకీయం చేయాలనే ఆలోచనే ఎవరికీ రాలేదని తేల్చి చెప్పారు. 


"2014 ఏప్రిల్ 5న ఎల్‌కే అద్వాణి చేసిన ప్రకటన ఇప్పుడు గుర్తు చేసుకోవాలనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని ఈవెంట్ మేనేజర్‌ అని వ్యాఖ్యానించారు అద్వాణి. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు మోదీ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇదంతా"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ


ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు చేపట్టింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ అధ్యక్షుడు JP నడ్డా సహా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరయ్యారు. 


Also Read: కేటీఎమ్‌ బైక్‌పై స్టైలిష్‌ లుక్‌లో రాహుల్ గాంధీ, లద్దాఖ్‌లో పాంగాంగ్ లేక్ వరకూ లాంగ్ రైడ్