తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 24న నిర్వహించనున్న 'టీఎస్ పాలిసెట్-2024' పరీక్ష నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ  (SBTET TS) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 259 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 92,808 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. గతేడాది 1.05 లక్షల మంది విద్యార్థులు పోటీపడగా.. ఈ సారి 92 వేలకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు.


పాలిసెట్‌-2024 ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలతోపాటు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు.


పరీక్ష విధానం..
మొత్తం 120 మార్కులకు పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్‌ (పెన్‌ అండ్‌ పేపర్‌) OMR విధానంలో పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. మ్యాథ్స్‌–60, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో లేదు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వీటి అనుబంధ సంస్థల్లో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు మాత్రమే బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయల్సి ఉంటుంది.


అర్హత మార్కులు ఇలా..
పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులుగా నిర్ణయించారు. వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు త‌ప్పనిసరిగా స్కోర్ చేయాలి.



వేర్వేరుగా పాలిసెట్ ర్యాంకుల ప్రకటన..
➥ తెలంగాణలో పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను కేటాయిస్తారు. ఇందులో టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందిస్తారు. ఆతర్వాత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. 
➥ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారికి మార్కులు విధానం 120గా ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్–60 మార్కులు, ఫిజిక్స్‌–30 మార్కులు, కెమిస్ట్రీ–30 మార్కులు ఉంటాయి.
➥ ఇక అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమా కోర్సులకు మార్కుల విధానం కూడా 120గా ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్–(60/2=30)–30, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీలో 30 మార్కులుగా ఉంటాయి.


విద్యార్థులకు ముఖ్య సూచనలు..
* పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. 
* పరీక్ష సమయానికి గంట ముందుగానే వారికి కేటాయించిన సెంటర్లకు చేరుకోవాలి.
* OMR విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి పరీక్ష సమయంలో గళ్లను సంపూర్ణంగా నింపాల్సి ఉంటుంది.
* మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, డిజిటల్ వాచీలను పరీక్షకు అనుమతించరు.
* పరీక్ష సమయం ముగిశాకే బయటకు పంపిస్తారు.