TS LAWCET 2024 Results: తెలంగాణలోని న్యాయకళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీలాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం (జూన్ 13న) వెల్లడించనున్నారు. జూన్ 13న మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ సంయుక్తంగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీజీలాసెట్/పీజీఎల్ సెట్ ర్యాంక్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి...
➥ అభ్యర్థులు ర్యాంకు కార్డు కోసం మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- lawcet.tsche.ac.in
➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Rank Card' అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ వివరాలు నమోదుచేసి సమర్పించగానే అభ్యర్థులకు సంబంధించిన ర్యాంక్ కార్డు కంప్యూటర్ తెర మీద దర్శనమిస్తుంది.
➥ ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.
టీజీలాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ జూన్ 3న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 3న ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు నిర్వహించారు. టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు తొలి రెండు సెషన్లు కలిపి మొత్తం 68 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 64 కేంద్రాలు, ఏపీలో 4 కేంద్రాలు ఉన్నాయి. ఇక మూడో సెషన్ పరీక్షలను మొత్తం 50 కేంద్రాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణలో 46 కేంద్రాలను, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం మొత్తం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో 79.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
అర్హత మార్కులు:
➥ TG LAWCET 2024 ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.
➥ PGLCET 2024 ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 30 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.
సీట్ల వివరాలు ఇలా..
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులతోపాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో దాదాపు 8 వేల సీట్లు ఉండగా.. వీటిలో కన్వీనర్ కోటా సీట్లు మొత్తం 6,894 వరకు ఉన్నాయి. ఈసారి కూడా దాదాపు అన్నే సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇందులో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి రాష్ట్రంలోని 22 కళాశాలల్లో 4,790 సీట్లు; ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి రాష్ట్రంలోని 19 కళాశాలల్లో 2,280 సీట్లు; రెండేళ్ల పీజీ లాడిగ్రీకి సంబంధించి రాష్ట్రంలోని 17 కళాశాలల్లో మొత్తం 930 సీట్లు ఉన్నాయి.
లాసెట్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..