తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
TS EAMCET 2023 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
దరఖాస్తుకు ఇక మూడు రోజులే గడువు
తెలంగాణ ఎంసెట్‌కు ఆలస్యరుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మూడురోజులే గడువు ఉంది. దరఖాస్తు గడువు ఏప్రిల్ 10నే గడువు ముగియగా.. రూ.5000 ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ఎంసెట్‌కు ప్రతి 100 మందిలో ముగ్గురు ఆలస్య రుసుంతోనే దరఖాస్తు చేసుకున్నారు. రూ.250 నుంచి రూ.5 వేల వరకు అదనంగా చెల్లిస్తుండటం గమనార్హం. రూ.5 వేలతో ఇప్పటివరకు 59 మంది దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం వరకు మొత్తం 8,394 మంది ఆలస్య రుసుంతో పరీక్ష రాయడానికి ముందుకొచ్చారు.
ఏప్రిల్ 28 సాయంత్రం నాటికి దాదాపు 3,20,310 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఎంసెట్ కోకన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి తెలిపారు. వారిలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండు పరీక్షలూ రాసేవారు 372 మంది ఉన్నారు. ఇంజినీరింగ్‌కు హాజరయ్యే 1,53,676 మందిలో 1.08 లక్షల మంది హైదరాబాద్‌లోనే పరీక్ష రాయనున్నారు. అగ్రికల్చర్‌లోనూ 94,470 మందికి గాను 63,730 మంది నగరంలోనే హాజరవనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ ఎంసెట్‌కు ఈసారి భారీగా దరఖాస్తులొచ్చాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌లోనూ ఇదే స్పష్టమవుతోంది. ఇప్పటివరకూ రెండు విభాగాలకు కలిపి 3,20,310 అప్లికేషన్లు అందాయి. ఇందులో తెలంగాణకు చెందినవి 2,48,146, ఏపీ నుంచి 72,164 దరఖాస్తుల వచ్చాయి. తెలంగాణలో ఇంటర్ వెయిటేజ్ ఎత్తివేయడంతో ఈసారి ఏపీ నుంచి దరఖాస్తులు పెరిగాయి. గతేడాది మొత్తం 2,66,714 దరఖాస్తులే రావడం గమనార్హం. కాగా ఈ ఏడాది అనూ హ్యంగా 53,224 దరఖాస్తులు (20%) పెరగడంతో ఆ మేరకు పరీక్ష కేంద్రాల పెంపుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
21 జోన్లలో పరీక్ష కోసం ఏర్పాట్లు..
ఎంసెట్ కోసం మొత్తం 21 జోన్లు ఏర్పాటు చేశారు. వీటిలో తెలంగాణ పరిధిలో 16 జోన్లు, ఏపీ పరిధిలో 5 జోన్లు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న జోన్లలో 5 హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,48,146 ఎంసెట్ దరఖాస్తులు వస్తే, హైదరాబాద్ కేంద్రంగానే 1,71,300 అప్లికేషన్లు రావడం విశేషం. హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లోనే జూనియర్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీల దృష్టీ ఇక్కడే ఉంటోంది. టెన్త్ పూర్తవ్వగానే ఇంటర్ విద్యాభ్యాసానికి, ఎంసెట్ శిక్షణకు హైదరాబాదే సరైన కేంద్రమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ కారణంగానే పిల్లల్ని హాస్టళ్ళలో ఉంచి మరీ చదివిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ కేంద్రంగానే ఎంసెట్ రాసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
పరీక్ష కేంద్రాల పెంపు..
ఎంసెట్ దరఖాస్తులు అనూహ్యంగా పెరగడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల్లోనూ పరీక్ష కేంద్రాలు పెంచాలనే ఆలోచనతో ఉన్నట్లు జేఎన్‌టీయూ-హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష నిర్వహించే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు.
సెషన్‌కు 40 వేల మంది..
ప్రస్తుతం ఎంసెట్‌లో ఒక్కో సెషన్‌కు 29 వేల మంది విద్యార్థుల వరకు ఆన్‌లైన్‌లో ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 40 వేలకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశంపై టీసీఎస్ అయాన్ సంస్థతో జేఎన్టీయూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎంసెట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయడం, ప్రశ్నపత్రాల నార్మలైజేషన్ సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది తక్కువ సెషన్లలో పరీక్షల నిర్వహణకు యోచిస్తున్నారు. ఏటా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవుతున్నారు. ఒక్కో సెషన్‌కు 40 వేల మంది విద్యార్థులు హాజరైతే ఎంసెట్ పరీక్షలను ఐదు రోజుల్లోనే ముగించవచ్చనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
రెండు వారాల్లో ఫలితాలు...
ఎంసెట్ పరీక్షలు ముగిసిన రెండు వారాల్లో ఫలితాలను ప్రకటిస్తారు. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ లేకపోవడంతో ఇంటర్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఫలితాల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల ఎంసెట్ మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. పరీక్ష ముగిసిన రెండు రోజుల్లో ప్రాథమిక ‘కీ ’ని, రెస్పాన్స్‌షీట్లను విడుదల చేసి 72 గంటల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ వెంటనే తుది ‘కీ’ని వెల్లడించి, ఫలితాల ప్రక్రియను ప్రారంభిస్తారు.
ఎంసెట్ షెడ్యూల్ ఇలా..
➥ ఎంసెట్ నోటిఫికేషన్ వెల్లడి: 28.02.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.
➥ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10.04.2023.
➥ దరఖాస్తుల సవరణ: 12.04.2023 - 14.04.2023.
➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.04.2023.
➥ రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.04.2023.
➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25.04.2023.
➥ రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 02.05.2023.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 30.04.2023 నుంచి
➥ పరీక్ష తేదీలు: మే 12 నుంచి 14 వరకు ఇంజినీరింగ్; మే 10, 11 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షలు.