తెలంగాణలో ఎంసెట్ అభ్యర్థుల కౌన్సెలింగ్ ఇవాల్టి (ఆగస్టు 30) నుంచి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఎంసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకూ సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.


అర్హతలివే..
కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులకు ఈ అర్హతలు ఉండాలి. 
విద్యార్థి భారత పౌరుడై ఏపీ లేదా తెలంగాణకు చెంది ఉండాలి. 
డిసెంబరు 31, 2021 నాటికి అభ్యర్థి వయసు 16 ఏళ్లు దాటాలి. డి-ఫార్మ్ విద్యార్థులకు 17 ఏళ్లు దాటి ఉండాలి
అభ్యర్థులు, ఎంసెట్‌ పరీక్ష రాయడం, ర్యాంక్ పొందడమే కాకుండా, అడ్మిషన్ పొందడానికి కౌన్సెలింగ్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలి.


కావాల్సిన పత్రాలు
తెలంగాణ ఎంసెట్ 2021 ర్యాంకు కార్డు, హాల్ టికెట్
ఆధార్ కార్డు
పదో తరగతి సర్టిఫికేట్
ఇంటర్ మెమో
ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్
ఇన్‌కం సర్టిఫికేట్ 
క్యాస్ట్ సర్టిఫికేట్
రెసిడెన్స్ సర్టిఫికేట్ 



ఈ నెల 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులంతా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే విడుదల చేసింది. కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖరారు చేశారు. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని పాపిరెడ్డి తెలిపారు.


ముఖ్యమైన తేదీలివే.. 
సెప్టెంబరు 4 నుంచి 11వ తేదీ: ధ్రువపత్రాల పరిశీలన.
సెప్టెంబరు 4 నుంచి 13వ తేదీ: వెబ్ ఆప్షన్లకు అవకాశం
సెప్టెంబరు 15వ తేదీ: ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయింపు
సెప్టెంబరు 15 నుంచి 20వ తేదీ: సెల్ఫ్ రిపోర్టింగ్ సమయం (ఆన్‌లైన్‌ విధానంలో చేయాలి)


ఉత్తీర్ణత శాతం ఇలా..
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం మంది, అగ్రికల్చర్ విభాగంలో 92.48 శాతం మంది అర్హత సాధించారని మంత్రి ప్రకటించారు ఇంజనీరింగ్ విభాగంలో 1,47,991 మంది విద్యార్థులు హాజరైతే 1,21,480 మంది క్వాలిఫై అయ్యారని పేర్కొన్నారు. ఇక అగ్రికల్చర్ విభాగంలో 79,009 మంది విద్యార్థులు హాజరవ్వగా 73,070 మంది అర్హత సాధించారని చెప్పారు. 


ఆగస్టు 4, 5, 6 తేదీల్లో టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్‌ విభాగాల పరీక్షలు.. 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ ఎంసెట్ పరీక్షలు జరిగాయి. టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలను 6 సెషన్లలో, అగ్రికల్చర్ విభాగం పరీక్షలను 3 సెషన్లలో నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 89.71 శాతం మంది హాజరయ్యారు. గతంతో పోల్చుకుంటే 28 వేల మంది విద్యార్థులు అదనంగా హాజరయ్యారని అధికారులు తెలిపారు.


Also Read: BRAOU Admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగించారు..


Also Read: AP SSC Result 2021: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... పదో తరగతి విద్యార్థులకు ఇకపై మార్కులే... గ్రేడింగ్ విధానానికి స్వస్తి