తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 59.89 లక్షలు ఉన్నట్లు విద్యాశాఖ తేల్చింది. రాష్ట్రంలోని దాదాపు 40,500 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక నుంచి పదో తరగతి వరకు 59.89 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు చైల్డ్ ఇన్ఫోలో వారికి సంబంధించిన సమగ్ర వివరాలను ఈ మేరకు నమోదు చేశారు. 


పాఠశాలల్లోని హాజరు రిజిస్టర్ల ప్రకారం చూస్తే విద్యార్థుల సంఖ్య 60.76 లక్షలుగా ఉన్నట్లు తేలింది. అంటే అటు పాఠశాల రిజిస్టర్లు, ఇటు ఛైల్డ్ ఇన్ఫోలో నమోదైన సంఖ్యలకు మధ్య 87 వేల వ్యత్యాసం ఉండటం గమనార్హం. అయితే మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డిలలో ఈ తేడా ఎక్కువగా ఉంది. టీసీ తీసుకున్నవారి పేర్లు ఇంకా తొలగించకపోవడం, ఇతరచోట్ల వారి పేర్ల నమోదుకు వీల్లేని పరిస్థితి ఉండటం తదితరాలు ఇందుకు కారణాలు కావొచ్చని భావిస్తున్నారు. 


జిల్లా పాఠశాల విద్యా సమాచారం (యూడైస్)లో నమోదు నాటికి విద్యార్థుల సంఖ్యలో వ్యత్యాసంపై ఒక స్పష్టతకు రావాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది(2021-22) 61.12లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు యూడైస్‌లో పేర్కొన్నారు. అంటే ఈ విద్యాసంవత్సరం 1.23లక్షల మంది తక్కువగా నమోదయ్యారు.


రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కేజీబీవీ, యూఆర్ఎస్, ఆదర్శ పాఠశాలల్లోని విద్యార్థులు చైల్డ్ ఇన్ఫోలో నమోదై ఉండాల్సిదే, వారిని మాత్రమే ప్రామాణికంగా పరిగణిస్తారు.  ఈ సంఖ్య ఆధారంగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, పాఠశాల నిధులు, మౌలిక వసతులు మంజూరు చేస్తూ ఉంటారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులందరి పేర్లు చైల్డ్ ఇన్ఫోలో నమోదయ్యేలా చూడాలి. అనంతరం మండల విద్యాధికారికి వివరాలను అందించాలి. ఎంఈవోలు, డీఈవోలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉంటారు.


'టెన్త్‌' విద్యార్థులకు గుడ్ న్యూస్, కొత్త 'మోడల్‌ పేపర్లు' వచ్చేస్తున్నాయ్!
తెలంగాణలో పదోతరగతి పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల్లో మార్పులకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసిన నేపథ్యంలో కొత్త మోడల్‌ పేపర్లను వెలువరించడానికి  విద్యాశాఖ సమాయత్తమవుతుంది. వీలైనంత త్వరగా వీటిని విడుదల చేయడానికి కసరత్తు ప్రారంభించింది. మోడల్ పేపర్లను మొదట ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చి, ఆ తర్వాత పాఠశాలలకు పంపాలని అధికారులు భావిస్తున్నారు. ప్రశ్నపత్రాల్లో వ్యాసరూప, షార్ట్‌ క్వశ్చన్స్‌ చాయిస్‌, మార్కుల్లో మార్పులతో కొత్త మోడల్ పేపర్లు ఉండనున్నాయి. ఇటీవలే పదోతరగతి పరీక్షల్లో 11 పేపర్లను ఆరుకు తగ్గించిన విషయం తెలిసిందే. ఆ మేరకు 6 పేపర్లకు సంబంధించిన మోడల్ పేపర్లను, బ్లూప్రింట్‌ను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వ్యాస రూప, సూక్ష్మ రూప ప్రశ్నలు కఠినంగా ఉన్నాయంటూ విద్యార్థి, ఉపాధ్యాయ  సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో టెన్త్‌ ప్రశ్నపత్రంలో మార్పులు తెచ్చారు. అదేవిధంగా పరీక్షకు  సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలకు మార్కులను తెలియజేసే బ్లూ ప్రింట్‌ను కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. ఎస్‌సీఈఆర్‌టీ ఈ ప్రక్రియను చేపట్టనుంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి-2023లో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...