Retail inflation: 2022 డిసెంబర్‌ నెలలోనూ దేశంలో ధరలు తగ్గి, రిటైల్ ద్రవ్యోల్బణం (Retail inflation) దిగి వచ్చింది. నవంబర్‌లో 5.88 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, డిసెంబర్‌లో 5.72 శాతానికి తగ్గింది, ఇది ఒక సంవత్సరం కనిష్ట స్థాయి. 


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లక్ష్యిత శ్రేణి ‍‌(Tolerance Band) అయిన 2-6% మధ్యలోనే ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా ఇది రెండో నెల.


డిసెంబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ.. గత ఏడాది ఇదే నెలలో (డిసెంబర్ 2021) నమోదైన 5.66 శాతంతో పోలిస్తే ఇప్పటికీ ఎక్కువగానే ఉంది.


తగ్గిన ఆహార పదార్థాల రేట్లు
దేశంలో ఆహార పదార్థాల ధరలు తగ్గడమే రిటైల్‌ ద్ర్యవ్యోల్బణం తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణమని జాతీయ గణాంక కార్యాలయం (NATIONAL STATISTICAL OFFICE - NSO) వెల్లడించింది.


ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 2022 అక్టోబర్‌లో 7.01 శాతంగా ఉంది. నవంబర్‌లో 4.67 శాతానికి, డిసెంబర్ నెలలో 4.19 శాతానికి తగ్గుతూ వచ్చింది. ఏడాది క్రితం (2021 డిసెంబర్‌లో) ఇది ఇంకా తక్కువగా, 4.05 శాతంగా ఉంది. 


2022 డిసెంబర్ నెలలో.. అటు పట్టణ ప్రాంతాలు, ఇటు గ్రామీణ ప్రాంతాలు రెండు చోట్లా ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 5.05 శాతంగా ఉంది. ఇది, నవంబర్‌లోని 5.22 శాతం నుంచి దిగి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 2.80 శాతంగా ఉండగా, నవంబర్‌లోని 3.69 శాతం నుంచి తగ్గింది. 


ఆకుకూరలు, కూరగాయల ద్రవ్యోల్బణం గత ఏడాది డిసెంబర్‌ కంటే ఇప్పుడు 15.08 శాతానికి తగ్గింది. అయితే, (Fruits) ద్రవ్యోల్బణం 2 శాతం పెరిగింది. పాలు, పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.51 శాతం, గుడ్ల ద్రవ్యోల్బణం 6.91 శాతం, సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం 20.35 శాతంగా ఉన్నాయి. నూనెలు, కొవ్వులు (Fats), చక్కెర విభాగంలో ధరలు దాదాపుగా మారలేదు.


దేశంలో పెరిగిన ధరలను తగ్గించడానికి, కొన్ని కమొడిటీల ఎగుమతుల మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఫలితంగా, ఎగుమతులు తగ్గి దేశంలో ఆయా కమొడిటీల లభ్యత పెరిగింది. ధరలు తగ్గాయి.


టాలరెన్స్ బ్యాండ్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం
నవంబర్ తర్వాత డిసెంబర్ నెలలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు RBI టాలరెన్స్ బ్యాండ్ ఎగువ స్థాయి (6 శాతం) కంటే దిగువనే ఉండడం ఉపశమనం కలిగించే విషయం. అక్టోబర్ 2022 వరకు, రిటైల్ ద్రవ్యోల్బణం RBI టాలరెన్స్ బ్యాండ్‌ పైనే  ఉంది. 


2022 ఏప్రిల్‌లో, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.79 శాతానికి చేరుకుంది. అప్పట్నుంచి నిర్వహించిన 5 ద్రవ్య విధాన నిర్ణయ సమావేశాల (Monetary Policy Committee - MPC) ద్వారా, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి RBI రెపో రేటును పెంచింది. రెపో రేటు 4 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకెళ్లింది. 


ఇప్పుడు.. ఫిబ్రవరి 2023లో RBI ద్రవ్య విధాన నిర్ణయ సమావేశం జరగనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండు నెలలు టాలరెన్స్‌ బ్యాండ్‌లోనే ఉన్న నేపథ్యంలో పాలసీ రేట్లలో RBI ఎలాంటి మార్పు చేయకపోవచ్చని మార్కెట్‌ అంచనా వేస్తోంది.