Telangana TET 2024 Exam: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2024) ఆన్‌లైన్ రాతపరీక్షలు నేడు(మే 20) ప్రారంభమయ్యాయి. జూన్ 2 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇందులో మే 20 నుంచి 29 వరకు పేపర్-2 పరీక్షలు, మే 30 నుంచి జూన్ 2 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ పరీక్షల కోసం 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా.. పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తులు సమర్పించారు.


ఇక పదోన్నతులకు టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి అని హైకోర్టు కొద్ది నెలల క్రితం పేర్కొన్నందున టీచర్లు సైతం దరఖాస్తు చేసుకున్నారు. వీరి సంఖ్య 80 వేలు ఉండగా.. 48,582 మంది సర్వీస్‌ టీచర్లు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 80 సెంటర్లను ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలో 42 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9.00 నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో విడతలో పరీక్షలు జరుగుతాయి. 


ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతించరు. అయితే పరీక్ష కేంద్రాలను సొంత జిల్లాల్లో కాకుండా దూరంగా వేరే జిల్లాలకు కేటాయించడంతో.. ముందురోజే ఆయా జిల్లాలకు చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో వసతి, భోజన ఖర్చుల భారం కూడా అభ్యర్థులపై పడనుంది. కేవలం పాత 9 జిల్లా కేంద్రాలు, సిద్దిపేట, సంగారెడ్డిలలోనే పరీక్షలు జరుపుతుండటం వల్లే ఈ కష్టాలు వచ్చాయని అభ్యర్థులు వాపోతున్నారు. 


తెలంగాణ టెట్ 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం: 


➥ టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు.


➥ పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.



అభ్యర్థులు ముఖ్య సూచనలు..


➥టెట్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. 


➥ నిర్ణయించిన తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9.00 నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో విడతలో పరీక్షలు జరుగుతాయి. 


➥ బయోమెట్రిక్‌ విధానం అమల్లో ఉన్నందున అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి గంటన్నర (90 నిమిషాల) ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 


➥ పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్‌ను మూసివేస్తారు. అభ్యర్థులను ఉదయం విడతకు 8.45 గంటలకు, మధ్యాహ్నం విడతకు 1.45 గంటలకే గేట్‌ను అధికారులు మూసివేస్తారు.


➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.


➥ అభ్యర్థులు బ్లాక్‌/బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్ను తీసుకెళ్లాలి. 


➥కాలిక్యులేటర్లు, లాగరిథమ్‌ టేబుళ్లు, పేజర్‌, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించరు.


➥ అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..