TS SSC Exam Fee Last Date: తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. విద్యార్థులు జనవరి 8 వరకు నిర్ణీత ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఫీజు చెల్లించాలని ఆయన వెల్లడించారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి ఇదే చివరి అవకాశమని కృష్ణారావు స్పష్టంచేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 14 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఫీజు చెల్లింపు వివరాలు..
➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125
➥ 3 సబ్జెక్టుల వరకు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.110
➥ 3 సబ్జెక్టులకు మించి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125.
➥ ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.60.
వీరికి ఫీజు నుంచి మినహాయింపు..
* కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి పట్టణాల్లో రూ.24 వేలకు మించకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలకు మించకూడదు (లేదా) 2.5 ఎకరాల సాగు భూమి, 5 ఎకరాల బంజరు భూమి ఉన్నవారికి ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును అధికారులు డిసెంబరు 30న (శనివారం) ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు (TS SSC Exams) నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. మార్చి 18తో పరీక్షలు ప్రారంభంకానుండగా.. మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు (Telangana 10th Class Exams) ముగియనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్, మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 1న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
పదోతరగతి పరీక్షల టైమ్ టేబుల్ కోసం క్లిక్ చేయండి..
'సైన్స్' పరీక్ష రెండు రోజులు..
తెలంగాణలో మార్చి నెలలో జరగనున్న పదోతరగతి పరీక్షల్లో ఈసారి సైన్స్ సబ్జెక్టు పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. సైన్స్‌లో ఫిజికల్ సైన్స్(పార్ట్-1), బయలాజికల్ సైన్స్(పార్ట్-2) పేపర్లుగా నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా పదోతరగతిలో ఆరు సబ్జెక్టులు ఉండగా... అందులో అయిదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్ (ప్రశ్నపత్రం) ఉంటుంది. సైన్స్‌లో రెండు పేపర్లు ఉన్నా ఒకే రోజు 15 నిమిషాల వ్యవధి ఇచ్చి ఒకదాని తర్వాత మరొకటి నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు గతంలో సర్కారుకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒక రోజు అదనంగా పరీక్ష ఉంటే ఆరోజు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి భత్యాలు చెల్లించాల్సి వస్తుందని.. విద్యాశాఖ భావించినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ విధానంపై పునరాలోచన చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో అధికారులు తాజాగా పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు.