Telangana SSC Exams 2024: తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును అధికారులు డిసెంబరు 30న (శనివారం) ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు (TS SSC Exams) నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. మార్చి 18తో పరీక్షలు ప్రారంభంకానుండగా..  మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు (Telangana 10th Class Exams) ముగియనున్నాయి. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్,  మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 1న  ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.

పరీక్ష తేదీ పేపరు
మార్చి 18 ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)
మార్చి 23 మ్యాథమెటిక్స్
మార్చి 26 ఫిజికల్ సైన్స్ 
మార్చి 28 బయాలజికల్ సైన్స్
మార్చి 30 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1 ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు
ఏప్రిల్ 2 ఓరియంటెల్ పేపర్-2

‘టెన్త్’ సైన్స్‌ పరీక్ష రెండు రోజులు..
తెలంగాణలో మార్చి నెలలో జరగనున్న పదోతరగతి పరీక్షల్లో ఈసారి సైన్స్‌ సబ్జెక్టు పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. సైన్స్‌లో ఫిజికల్ సైన్స్(పార్ట్-1), బయలాజికల్ సైన్స్(పార్ట్-2) పేపర్లుగా నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా పదోతరగతిలో ఆరు సబ్జెక్టులు ఉండగా... అందులో అయిదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్‌ (ప్రశ్నపత్రం) ఉంటుంది. సైన్స్‌లో రెండు పేపర్లు ఉన్నా ఒకే రోజు 15 నిమిషాల వ్యవధి ఇచ్చి ఒకదాని తర్వాత మరొకటి నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు గతంలో సర్కారుకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒక రోజు అదనంగా పరీక్ష ఉంటే ఆరోజు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి భత్యాలు చెల్లించాల్సి వస్తుందని.. విద్యాశాఖ భావించినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ విధానంపై పునరాలోచన చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో అధికారులు తాజాగా పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు.

ALSO READ:

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత శిక్షణ, ప్రవేశాలు ఎలా అంటే?
తెలంగాణ‌లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. 
ప్రవేశాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...