TS Inter Practical Exams 2022: తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డు శుభవార్త చెప్పింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8, 9 వరకు ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలకు 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించాలని ఇంటర్‌బోర్డు కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. ఆ మినహాయింపు సమయం తరువాత ప్రయోగ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను అనుమతించకూడదని ఈ మేరకు బోర్డు కార్యదర్శి జలీల్ ఆదేశాలు జారీ చేశారు.
నేటి నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..
ఇంటర్ విద్యార్థులకు వారు చదివే కాలేజీలలో ప్రయోగ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తారు. బోర్డు పరీక్షలైతే ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్ణీత సమయంలో నిర్వహిస్తారు. నేటి నుంచి ఆన్‌లైన్‌లో ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ కాలేజీలోని 25 శాతానికి మించి విద్యార్థులకు 30కి 30 మార్కులు వస్తే.. వారితో పాటు అత్యధిక మార్కులు వచ్చిన మిగతా విద్యార్థుల జవాబు పత్రాలను తాము మరోసారి పరిశీలిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఎగ్జామినర్లు విద్యార్థులకు ప్రయోగ పరీక్షలలో వేసిన మార్కులను కాలేజీ యాజమాన్యాలు, లేక ప్రిన్సిపాల్స్ అదే రోజు రాత్రి 8 గంటలలోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ సూచించింది.
జేఈఈ కారణంగా రీషెడ్యూల్..
ఏప్రిల్‌లో జరగాల్సిన ఇంటర్మీడియల్ బోర్డ్ ఎగ్జామ్స్‌ను జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీల కారణంగా రీ షెడ్యూల్ చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డ్. పదో తరగతి పరీక్షలను సైతం విద్యా శాఖ రీషెడ్యూల్ చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు (Inter First Year Exams 2022) మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో జరగనున్నాయి. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు (Inter Second Year Exams 2022) మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. పర్యావరణ పరీక్షను ఏప్రిల్ 11, 12 తేదీల్లో నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేశారు.
Also Read: Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూల్ ఇదీ, ఎప్పటినుంచంటే