TG Inter Board Exams: తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు తీరుపై వివర్శలు వస్తున్నాయి. సాధారణంగా వార్షిక పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల్లో ఏమైనా మార్పులు చేస్తే.. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఆ సమాచారాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రశ్నపత్రాల బ్లూప్రింట్ తయారు చేసి, విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రంపై అవగాహన కల్పించలేకపోతే లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాని ఇంటర్‌బోర్డు ప్రవర్తన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇంటర్‌ వార్షిక పరీక్షల (Inter Board Exams)కు కేవలం నెలన్నర ముందు ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ సబ్జెక్టు క్వశ్చన్ పేపర్ నమూనాలో మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆ సబ్జెక్టులో మూడు సెక్షన్లు.., 16 ప్రశ్నలు ఉండేవి. కాని మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలో ఒక ప్రశ్నను అదనంగా చేర్చారు. మరో నెలరోజుల్లో పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బోర్డు చివరినిమిషంలో మార్పులు చేయడంపై విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. 

Continues below advertisement


ఛాయిస్‌ లేకుండానే.. 
ఇప్పటివరకు ఇంగ్లిష్ సెక్షన్‌-సిలో ఒక ప్రశ్నకు 8 మార్కులు, మిగిలిన ప్రశ్నలకు 4 మార్కులు ఉండేవి. తాజాగా ఆ సెక్షన్‌లోని 8 మార్కుల ప్రశ్నను 4 మార్కులు తగ్గించి... కొత్తగా జతచేసిన ప్రశ్నకు ఆ 4 మార్కులు కేటాయించారు. అంతేకాదు... దాన్ని మ్యాచ్‌ ది ఫాలోయింగ్‌ తరహా ప్రశ్నగా మార్చారు. దాంట్లోనూ 10 ఇస్తే 8కి మ్యాచ్‌ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కోదానికి అర మార్కు కేటాయించారు. ఇంటర్‌ విద్యార్థులు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 


ప్రభుత్వ విద్యార్థులకు తీవ్ర నష్టం..
కొత్తగా పరీక్షలకు ముందు ఇలా ప్రశ్నపత్రాల విధానంలో మార్పు చేస్తే ఎలా అని ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మార్పులు ప్రభుత్వ జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థులకు అంత సాధారణంగా అర్థం కావ‌ని అంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు సగం మంది మాత్రమే తరగతులకు వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఈ మార్పును ఎలా చెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలకు ముందు ఇలాంటివి చేస్తుంటే దీనిపై దృష్టి కేంద్రీకరించాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని ఇంటర్‌ విద్యాశాఖ జిల్లా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.  పరీక్షలు సమీపిస్తుండంటతో కాలేజీలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుందని వారికి నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ప‌రీక్షలు స‌మీపిస్తున్న స‌మ‌యంలో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాలి, ప్రోత్సాహాన్ని అందించాలే కాని, ఇలాంటి మార్పులు చేసి వారికి మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. అస‌లు ఇలాంటి మార్పులు ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నప్పుడు చేయ‌డం స‌రికాద‌ని విమ‌ర్శిస్తున్నారు. 


ALSO READ: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?


టీపీజేఎంఏ ఆగ్రహం..  
విద్యార్థులకు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు తెలపకుండా ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేయడమంటే పిల్లల జీవితాల్లో ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఆడుకోవడమేనని తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల యాజమాన్యాల సంఘం(TPJMA) రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్‌ ఇంటర్ బోర్డును ప్రశ్నించారు. జనవరి 17న ప్రశ్నపత్రంలో మార్పుల వివరాలు ఆన్‌లైన్‌లో ఆయా కళాశాలలకు పంపారన్నారు. ప్రభుత్వ పెద్దలు దీనిపై దృష్టి సారించి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...