India-China Talks: భారత్​ డిమాండ్లకు చైనా ఓకే.. ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య విమానాలు!

India-China Relationship | గల్వాన్​ ఘటన తర్వాత భారత్​–చైనా మధ్య పూర్తిగా దెబ్బతిన్న సత్సంబంధాలు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. భారత్​ డిమాండ్లకు చైనా అంగీకరించింది

Continues below advertisement

గల్వాన్​ ఘటన తర్వాత భారత్​–చైనా (India -China) మధ్య పూర్తిగా దెబ్బతిన్న సత్సంబంధాలు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య నేరుగా విమానాల రాకపోకలు, కైలాష్ మానసరోవర్‌ను సందర్శించడానికి భారతీయ యాత్రికులను అనుమతించడంతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్​లో చైనా అధ్యక్ష పదవికి మద్దతు ఇవ్వడం వంటి అంశాలు పునరుద్ధరణ కానున్నాయి. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. ఆ దేశంతో సత్సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

Continues below advertisement

కీలక అధికారులతో చర్చలు
చైనాలోని కమ్యూనిస్ట్ సెంట్రల్ కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయిన విక్రమ్​ మిస్రీ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మంగళవారం సమావేశమయ్యారు. పార్టీ ఆఫ్ చైనా, సెంట్రల్ కమిషన్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయంలో చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ శాఖ మంత్రి లియూ జియాంచావోతో కూడా భేటీ అయ్యారు.  

సమగ్ర సమీక్ష
మిస్రీ, సన్ మధ్య జరిగిన సమావేశంలో భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల స్థితిని సమగ్రంగా సమీక్షించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పునర్నిర్మించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. టిబెట్‌లో ఉన్న కైలాష్ మానసరోవర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు యాత్రికులను అనుమతించాలన్న భారత్ డిమాండ్‌కు చైనా అంగీకరించింది. ‘చైనాలోని జిజాంగ్ అటానమస్ రీజియన్‌లోని కైలాష్ మానసరోవర్‌కు భారతీయ యాత్రికుల సందర్శనను పునఃప్రారంభించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.  వీలైనంత త్వరగా సంబంధిత ఏర్పాట్లపై చర్చిస్తాం’ అని సమావేశంలో చైనీస్ రీడౌట్ తెలిపింది. 

ధ్రువీకరించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ
ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం ధ్రువీకరించింది. 2025 వేసవిలో కైలాష్ మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించాలని భారత్​–చైనా  నిర్ణయించుకున్నాయని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను సంబంధిత యంత్రాంగం చర్చిస్తున్నట్లు పేర్కొంది. 

నేరుగా విమానాలు
ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు కూడా ఇరు పక్షాలు అంగీకరించాయి. ‘ఇరు దేశాల ప్రజల సౌకర్యార్థం పలు కీలక అంశాలను సులభతరం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సేవలను పునఃప్రారంభించేందుకు చైనా సూత్రప్రాయంగా అంగీకరించింది. తదుపరి కార్యాచరణపై ఇరు దేశాల అధికారులు చర్చలు సాగిస్తున్నారు’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది.

75 ఏళ్ల వార్షికోత్సవాలు
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాలు జరుపుకోవాలన్న చైనా డిమాండ్‌కు భారత్ కూడా అంగీకరించింది. దౌత్య సంబంధాలు, ప్రజల్లో ఇరు దేశాలపై సదభిప్రాయం కల్పించేందుకు ఈ ఏడాది వార్షికోత్సవాలు చేపట్టాలని భావిస్తున్నాయి. ఈ చర్చల పట్ల ఇరు దేశాల నేతలు కూడా సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

గాల్వాన్​ ఘటన
2020 జూన్‌ 15న తూర్పు లద్దాఖ్‌ గల్వాన్‌ వద్ద భారత సైనికులు వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్న ఓ తాత్కాలిక వంతెనను చైనా సైన్యం తొలగించేందుకు ప్రయత్నించింది. దీంతో రెండు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులు కాగా.. తమ సైనికులు నలుగురే చనిపోయినట్లు చైనా ప్రకటించింది. ఈ ఘటనలో 38 మంది చైనా సైనికులను కోల్పోయిందని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధనాత్మక వార్తాపత్రిక ‘ది క్లాక్సన్‌’ వెల్లడించింది.

Continues below advertisement