తెలంగాణలో ఇంటర్ బోర్డు పరిధిలో నిరభ్యంతర పత్రం(NOC) సమర్పించకపోవడం వల్ల ఫీజు చెల్లించలేకపోయిన దాదాపు 217 కళాశాలల్లోని సుమారు 50 వేల మంది ఇంటర్ విద్యార్థులకు శుక్రవారం(జనవరి 25) హైకోర్టు నుంచి ఊరట దక్కింది. ఇంటర్ పరీక్ష ఫీజును రూ.2,500 ఆలస్య రుసుంతో చెల్లించేందుకు శనివారం (జనవరి 25) చివరితేదీ కాగా.. ఈ ఆలస్య రుసుం లేకుండానే చెల్లించేందుకు అనుమతించాలని ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 


అసలేం జరిగింది?
రాష్ట్రంలో గుర్తింపు పొందని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ.. ఒక్కొక్కరికీ రూ.2,500 చొప్పున బ్యాంకు గ్యారంటీని సమర్పించాలని ఆయా కళాశాలల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. కళాశాలలు నిరభ్యంతర పత్రం సమర్పించడానికి తగినంత గడువు ఇచ్చినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో విద్యార్థులకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఇవ్వలేదని, ప్రస్తుతం ఇంటర్‌ బోర్డు విధించిన రూ.లక్ష జరిమానా మొత్తానికి మినహాయింపు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ టి.వినోద్‌ కుమార్ విచారణ చేపట్టారు.


వాదనలు ఇలా..
విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఆయా కళాశాలల తరఫున అసోసియేషన్ పిటిషన్ వేసిందని, ఏ కళాశాలలైతే జరిమానాను ఎదుర్కొంటున్నాయో ఆ కాలేజీలు కోర్టును ఆశ్రయించలేదని, అందువల్ల ఈ పిటిషన్ విచారణార్హతను కూడా తేల్చాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుతం గుర్తింపులేని ఈ కాలేజీల్లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులను మార్చిలో పరీక్షలకు అనుమతించడానికిగాను ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లిస్తామని, విద్యార్థులకు ఆలస్య రుసుం రూ.2,500 మినహాయించాలని కోరుతున్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజును అనుమతించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఆయా కాలేజీలు ప్రభుత్వం విధించిన జరిమానాను 25 లోగా చెల్లించాల్సి ఉందన్నారు. 


బ్యాంకు గ్యారీంటీలు సమర్పణకు 28 వరకు అవకాశం..
ఆయా కాలేజీలు విద్యార్థులకు సంబంధించి బ్యాంకు గ్యారంటీని జనవరి 28లోగా సమర్పించాలని ఆదేశాలు జారీచేశారు. కాలేజీలు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాక విద్యార్థుల పరీక్ష దరఖాస్తు ప్రక్రియను కొనసాగించి మార్చి పరీక్షలకు అనుమతించాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీచేస్తూ విచారణను జనవరి 28కి వాయిదా వేశారు. విద్యార్థులు ఫీజు చెల్లించడానికి శనివారం చివరి తేదీ అని, కనీసం మరికొంత గడువు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను నిరాకరించారు.


పరీక్ష ఫీజు వివరాలు..


➥ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు(జనరల్):  రూ.520


➥ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు(ఒకేషనల్, ప్రాక్టికల్స్‌): రూ.750.


➥ ఇంటర్ సెకండియర్‌ జనరల్ (ఆర్ట్స్) విద్యార్థులు రూ.520.


➥ ఇంటర్ సెకండియర్‌ జనరల్ (సైన్స్) విద్యార్థులు రూ.750.


➥ ఇంటర్ సెకండియర్‌ ఒకేషనల్ విద్యార్థులు రూ.750.


ALSO READ: ➥ Tenth Exams: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అలర్ట్ - ప్రీ-ఫైన‌ల్ ప‌రీక్షలు ఎప్పటినుంచంటే?


                      JEE Main: జేఈఈ మెయిన్‌ విద్యార్థులకు అలర్ట్ - ఆ తేదీ పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..