Telangana Gurukul Admissions: తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యకు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలంగాణ గురుకుల విద్యాసంస్థలు మరో కీలక విద్యా సంవత్సరానికి సిద్ధమయ్యాయి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించే లక్ష్యంతో నడుస్తున్న ఈ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశమని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రవేశాల ప్రక్రియ- కీలక తేదీలు
ఈ విద్యా సంవత్సరానికి ఐదో తరగతితోపాటు ఆరో తరగతి నుంచి 9 వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం:- జనవరి 11, 2026
దరఖాస్తుకు చివరి తేదీ:- జనవరి 22, 2026
ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 22, 2026
పరీక్ష సమయం: ఉదయం 11 గంట నుంచి మధ్యాహ్నం నుంచి 1 గంట వరకు
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కేవలం రూ. 100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పరీక్షను అన్ని జిల్లా కేంద్రాల్లో, ఎంపిక చేసిన కొన్ని ముఖ్య కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రత్యేక పాఠశాలలపై దృష్టి
సాధారణ గురుకుల పాఠశాలలతోపాటు, కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన పాఠశాలల్లో కూడా ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. ముఖ్యంగా రక్షణ రంగంపై ఆసక్తి ఉన్న వారికి, కళారంగాన్ని వృత్తిగా ఎంచుకోవాలనుకునే వారికి ఇవి వరం లాంటివి.
సైనిక్ స్కూల్స్: జగద్గిరిగుట్టలోని సైనిక్ స్కూల్(బాలికల కోసం), రుక్మాపూర్‌లోని సైనిక్‌స్కూల్(బాలుర కోసం) ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్: మల్కాజ్‌గిరిలోని ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్‌లో బాలురు, బాలికల కోసం ఆరో తరగతి ప్రవేశాల కల్పిస్తున్నారు.
ఈ ప్రత్యేక పాఠశాలలు కేవలం చదువు మాత్రమే కాకుండా, విద్యార్థుల్లోని ప్రత్యేక ప్రతిభను వెలికితీస వారిని భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతాయి.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
- కుల ధ్రువీకరణ పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- జనన ధ్రువీకరణ పత్రం
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
- మొబైల్ నెంబర్
తెలంగాణ గురుకులాలు నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ఇక్కడ చదువుతున్న చాలా మంది విద్యార్థులు ఐఐటీ ఎన్‌ఐటీ, ఎంబీబీఎస్ సీట్లు సాధించి రాష్ట్ర ఖ్యాతిని చాటుతున్నారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడలు, యోగా, సంగీతం, నాయకత్వ లక్షణాలు పెంచుకొని ఈ పాఠశాలలు ముందున్నాయి.