TS TET Application Extended: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET)- 2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 10తో గడువు ముగియాల్సి ఉండగా.. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఏప్రిల్ 9 సాయంత్రం నాటికి కేవలం టెట్‌కు 1,93,135 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో పేపర్-1కు 72,771 మంది, పేపర్-2కు 1,20,364 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోల్చితే దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకునేందుకు ఏప్రిల్ 11 నుంచి 20 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది.
పెరిగిన ఫీజులే కారణమా..? ఈసారి నిరుద్యోగులతోపాటు ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్ష రాస్తారని విద్యాశాఖ భావించింది. కానీ ఈసారి దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 2 లక్షల మంది కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు. టెట్ ఫీజులను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజు పెంచారు. ఈ విషయంలో అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనలేదు. దీంతో అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మరోవైపు వరుసగా సెలవుల రావడంతోనూ టెట్ దరఖాస్తులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచి, ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగాది, రంజాన్ పండుగల సెలవుల కారణంగా మీ సేవ సెంటర్లు పనిచేయలేదని, మరో మూడు రోజులు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఒకవైపు దరఖాస్తులు తక్కవగా రావడం, మరోవైపు గడువు పెంచాలని వచ్చిన వినతుల నేపథ్యంలో ప్రభుత్వం మరో 10 రోజులపాటు టెట్ దరఖాస్తుకు అవకాశం కల్పించింది.
డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్..తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభమైంది. డీఎస్సీకి ముందు టెట్ నిర్వహణ తప్పనిసరి అని కోర్టు ఆదేశించడంతో ఏప్రిల్ 2తో ముగియాల్సిన గడువును జూన్ 20 వరకు పొడిగించింది. ఇఖ జులై 17 నుంచి 31 వరకు టీఎస్ డీఎస్సీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా 37,700 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 2.14 లక్షల మంది వరకు దరఖాస్తులు సమర్పించారు.తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు..ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 15 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 7075701768, 7075701784 నంబర్లలో సంప్రదించవచ్చు.
వీరు అర్హులు..➥ టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే.
➥ టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
పరీక్ష విధానం:
➥ టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు.
➥ పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు..
➥ టెట్-2024 నోటిఫికేషన్: 14.03.2024.
➥ టెట్-2024 ఇన్‌ఫర్మేషన్ బులిటెన్, సమగ్ర నోటిఫికేషన్: 22.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 27.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు. ఫీజు చెల్లింపునకు చివరితేది: 10.04.2024. (20.04.2024 వరకు పొడిగించారు)
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 15.05.2024 నుంచి.
➥ టెట్-2024 పరీక్ష తేదీలు: 20.05.2024 - 03.06.2024.
➥ పరీక్ష సమయం: ఉదయం 9 గం. - 11.30 గం. వరకు, మధ్యాహ్నం 2 గం.- సాయంత్రం 4.30 వరకు.
➥ టెట్-2024 ఫలితాల వెల్లడి: 12.06.2024.
TS TET 2024 Detailed Notification