తెలంగాణ పదోతరగతి పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా ఆరు పేపర్లతోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం 2022-23 కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వల్ల గత విద్యాసంవత్సరంలో 11 పేపర్లకు బదులు ఆరు పేర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ ఏడాది కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. కరోనా కారణంగా విద్యార్థులపై సిలబస్ భారం పడకుండా ఉండేందుకు గత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకే నిర్వహించారు. అలాగే సిలబస్‌లోనూ కూడా మినహియింపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ ఏడాది నుంచి ఇక ప్రతి సబ్జెక్టు ఒక పేపర్ ఉండనుంది. అంటే 6 పేపర్లతోనే పరీక్ష నిర్వహిస్తారు.
పదోతరగతి పరీక్ష విధానంపై సమీక్ష జరిపిన NCERT విద్యార్థులకు 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిని ఆరు పేపర్లకు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 6 పేపర్ల విధానానికే మొగ్గు చూపింది. పదో తరగతి విధి విధానాలను మారుస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్1 నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఎస్‌ఏ-1 పరీక్షలు జరుగుతున్నాయి. ఎస్‌ఏ-1 కూడా పదోతరగతికి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించేలా అధికారులు షెడ్యూలు రూపొందించారు.
తెలంగాణలో ఈసారి పదోతరగతి వార్షిక పరీక్షలకు ఎప్పటిలాగా 11 పేపర్లే ఉంటాయని సెప్టెంబరులో పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంటే ఒక్క హిందీకి తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు రెండు పేపర్లు (పరీక్షలు) ఉంటాయి. ఈసారి సాధారణ పరిస్థితులే ఉన్నందున సిలబస్ కూడా తగ్గించలేదని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నుంచి సిలబస్ పేపర్లను తగ్గించాలని తమకు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఇకపై పదోతరగతి పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించనున్నారు. గత మే నెలలో జరిగిన వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించిన విషయం తెలిసిందే.
:: ఇవీ చదవండి ::
పదోతరగతి పరీక్ష ఫీజు ఖరారు చేసిన ప్రభుత్వం, ఆలస్య రుసుముతో చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫీజును ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం నవంబరు 15 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లకు ఫీజును చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. ఇక రూ.50 ఆలస్యరుసుముతో నవంబర్ 30 వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 15 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ.125గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపు తేదీల్లో ఏమైనా సెలవులు వస్తే.. మరుసటిరోజు ఫీజు చెల్లించవచ్చు.
ఫీజు నుంచి వీరికి మినహాయింపు..
కుటుంబ వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.24,000 కు మించకూడదు, అలాగే గ్రామాల్లో ఆదాయం రూ.20,000 మించకూడదు లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్/ 5 ఎకరాల డ్రై ల్యాండ్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
పరీక్ష ఫీజు వివరాల కోసం క్లిక్ చేయండి...
ఆ రెండు జిల్లాల విద్యార్థులకు అలర్ట్, మారిన 'ఎస్ఏ-1' పరీక్షల షెడ్యూలు!!
తెలంగాణలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు రాసే సమ్మేటివ్ అస్సెస్‌మెంట్ (ఎస్‌ఏ-1) పరీక్షల షెడ్యూల్ రెండు జిల్లాల్లో మళ్లీ మారింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాల పరీక్ష షెడ్యూల్‌ను మార్చుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఈమేరకు అక్టోబరు 25న ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారమైతే నవంబర్ 1 నుంచి 7 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఉప ఎన్నిక కారణంగా ఆ రెండు జిల్లాల్లో మాత్రం నవంబర్ 9 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా షెడ్యూల్ మారడం ఇది రెండో సారి. ముందు ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని చెప్పిన అధికారులు ఆ తర్వాత 11 పేపర్లే ఉంటాయని ఉత్తర్వుల్లో జారీ చేశారు. తాజాగా ఇప్పుడు రెండు జిల్లాల పరీక్ష షెడ్యూల్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తుగా జిల్లా విద్యాధికారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడంవల్లనే ఈ విధమైన మార్పులు జరుగుతున్నట్లు విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి.