తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇకపై ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలని, ఇంగ్లిష్‌లోనే బోధించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. అవసరాన్ని బట్టి తెలుగు, ఉర్దూలను కూడా వినియోగించాలని తెలిపింది. సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది.
గత విద్యాసంవత్సరంలో 1 -8 తరగతులు, ఈ ఏడాది 9వ తరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియం చదువుల అమలుపై పాఠశాల విద్యాశాఖ సమీక్షించింది. ఇంగ్లిష్ మీడియం బోధనలో అనేక సవాళ్లు ఎదురవుతున్నట్టు విద్యాశాఖ గుర్తించింది. ఈ సమస్యల పరిష్కారానికి 'ఇంగ్లిష్' తప్పనిసరి అని భావించిన ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయులకు అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాటించాల్సిందే.
ముఖ్యంగా తెలుగు, ఉర్దూ మీడియం టీచర్లనే నియమించడంతో భాషేతర సబ్జెక్టులను ఇంగ్లిష్‌లో బోధించడం కష్టమవుతుందని, తరగతి గదిలో బోధన తెలుగు, ఉర్దూలోనే కొనసాగుతున్నదని గుర్తించింది. ఇక విద్యార్థులు కూడా ఇంగ్లిష్‌లో ఇచ్చిన ప్రశ్నపత్రాలను అర్థం చేసుకోలేకపోతున్నారని, ఇంగ్లిష్‌లో రాయలేకపోతున్నారని తేల్చింది. ఈ సమస్యలను అధిగమించేందుకు నిపుణులతో చర్చించి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఆయా మార్గదర్శకాలను పాటించాలని డీఈవోలకు సూచించింది. విద్యార్థుల పదజాలాన్ని, పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు, బహుభాషా, అనువాద పద్ధతులను అవలంబించాలని ఆదేశించింది.
విద్యాశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు ఇలా..
➥ ఉపాధ్యాయులు 7వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన కృత్యాలు, సూచనలు, ప్రయోగాలకు, ఆటలను తెలుగు, ఉర్దూలో నిర్వహించినా.. ఇదంతా 8, 9 తరగతుల్లో పూర్తిగా ఇంగ్లిష్‌లోనే జరగాలి. ఈ విద్యార్థులు పదోతరగతికి వచ్చేసరికి ఇంగ్లిష్ వాడాలి.
➥ ఇంగ్లిష్ నైపుణ్యాల వృద్ధికి టీచర్లు దీక్షా పోర్టల్, ఇతర వెబ్‌సైట్ల వీడియోలను వినియోగించుకోవచ్చు.
➥ మౌఖిక కార్యకలాపాల ద్వారా విద్యార్థులు కాన్సెప్ట్‌ను సహేతుకంగా తెలుసుకొన్నాక, పాఠ్యాంశాలను ఇంగ్లిష్‌లో చదవడం అనుసరించాలి.
➥ బోధనలో బహుల భాషలు వాడాలి. ముఖ్యమైన ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయాలి.
➥ ఇంగ్లిష్ దినపత్రికలు, మ్యాగ్జిన్లు చదవాలి. ఇంగ్లిష్ టీవీ చానళ్లను వీక్షించాలి.
పదోతరగతి ఫీజు చెల్లించడానికి నవంబరు 17 వరకు అవకాశం..
తెలంగాణలో పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూలు నవంబరు 2న విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం విద్యార్థులు నవంబర్ 17 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే రూ.50 ఆలస్యరుసుముతో డిసెంబరు 1 వరకు, రూ.200 ఆలస్యరుసుముతో డిసెంబరు 11 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ప్రకటలో స్పష్టం చేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 14 సంవత్సరాలు నిండి ఉండాలి. కుంటంబ వార్షిక ఆదాయం ఏడాదికి పట్టణాల్లో రూ.24 వేలకు మించకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలకు మించకూడదు (లేదా) 2.5 ఎకరాల సాగు భూమి, 5 ఎకరాల బంజరు భూమి ఉన్నవారికి ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..